Banner
banner

ఒక పత్రిక నలభై ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగటం సామాన్యమైన విషయం కాదు. అప్పుడప్పుడు కొన్ని పెద్ద పత్రికలు మాత్రమే చేయగలుగుతాయి. అందుకు వెనక చాలా పెద్ద అండదండ,పెట్టుబడులు కావాలి. కానీ ఓ చిన్న పత్రిక భారీ పాఠాకాదరణ పొంది, ఇన్నేళ్లు విజయయాత్ర సాగించటం గర్వించతగ్గ విషయమే. గొప్ప సంగతే. అలాంటి ఓ అరుదైన ఘనతను నెల్లూరు జిల్లా పత్రికా రంగంలో పురుడుపోసుకున్న ‘లాయర్‌’  సాధించింది.

 1981 జూన్‌ 5వ తేదీన నెల్లూరు జిల్లాలో మొదలైన ‘లాయర్‌’ వారపత్రిక 40 వసంతాలు పూర్తిచేసుకుని మరిన్ని సంవత్సరాలు పాటు కొనసాగటానికి స్పూర్తినిస్తోంది. ఈ ‘లాయర్‌’ 40వ వార్షికోత్సవ వేడుక నవంబరు 12వ తేది శుక్రవారం.. లాయర్‌ పాఠకులు, ప్రకటన కర్తలు, అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సంబరంగా జరిగింది. తొలినాటి నుంచి ఈ పత్రికకు ఒకటే నిబద్దత..ఆలోచన అదే నైతిక విలువల పట్ల గౌరవం. అందుకే ఈ 40 సంవత్సరాల  ‘లాయర్‌’ వార్షికోత్సవ వేడుకలో భారత ఉపరాష్ట్రపతి, గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.  ఓ చిన్న పత్రికకు దక్కిన అతిపెద్ద గౌరవం..మరెన్నో చిన్న పత్రికలకు ఇచ్చే ధైర్యం.

వివరాల్లోకి వెళ్తే…నెల్లూరు`గొలగమూడిరోడ్డులోని విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వేడుక ఘనంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విశిష్ట అతిథిగా ఈ వేడుకకు వచ్చి లాయర్‌ను ఆశీర్వదించారు. అలాగే ఆత్మీయ అతిథులుగా శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపక ఛైర్మెన్‌, పద్మభూషణ్‌ డా.కెఐ వరప్రసాద్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు పద్మభూషణ్‌ డా. కె.శ్రీనాధ్‌రెడ్డి, డిఆర్‌డిఓ ఛైర్మెన్‌ డా. జి.సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘లాయర్‌’ పత్రిక వ్యవస్థాపకులు స్వర్గీయ తుంగా రాజగోపాలరెడ్డి గారు చిరస్మరణీయులు. ఆయన సేవలు ఆదర్శ ప్రాయం. పత్రికను వ్యాపారంగా కాకుండా ఆయన ఆరాధనాభావంతో నడిపారు. అక్షరసేద్యం చేశారు, జర్నలిజం వ్యాపారం కాకూడదని దృఢంగా భావించే రాజ గోపాలరెడ్డి అభిప్రాయంతో తాను ఏకీభ విస్తానని అన్నారు . ముక్కు సూటి మనస్తత్వం.. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతమందినైనా ఎదిరించగలిగే.. పోరాడగలిగే ఆయన వ్యక్తిత్వం.. ప్రతి జర్నలిస్టుకీ ఆదర్శం కావాలి … అని  కొనియాడారు.  

చిన్ననాటి నుంచి తనకు రాజగోపాలరెడ్డితో పరిచయం ఉందని, వాళ్ళబ్బాయి శివప్రభాత్‌ (‘లాయర్‌’ సంపాదకుడు) ఎంతోకాలంగా తనకు తెలుసని, ఇప్పుడు ఆయన కుమారుడు (ప్రజిత్‌రెడ్డి)ని.. 3వ తరాన్ని కూడా చూస్తున్నానని, వీరంతా మంచి బాటలో పయనిస్తుండడం సంతో షంగా ఉందని అన్నారు. ప్రతిభను తానెప్పుడూ ప్రోత్సహిస్తుంటానని, కష్టపడేవారిని, నిజాయితీగా ఉండేవారిని ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటానని ఆయన అన్నారు.

 పద్మభూషణ్‌ కెఐ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. అక్షరాన్ని అణాకి అమ్ముకుని, ఆత్మాభిమానాన్ని చంపుకుని అనేక పత్రికలు మనుగడ సాగిస్తున్న నేటికాలంలో క్షరం కాని అక్షరాలతో, సత్యమే చెప్పాలని తుంగా రాజగోపాలరెడ్డి చేపట్టిన అక్షరయజ్ఞాన్ని నేటికీ వారి తనయుడు శివప్రభాత్‌రెడ్డి కొనసాగిస్తున్నారు. తండ్రి ఆదర్శాలకి వారసునిగా నిలుస్తూ ప్రభు (శివప్రభాత్‌రెడ్డి) పత్రికను సమర్ధవంతంగా నడుపుతున్నాడు అని మెచ్చుకున్నారు.

` పద్మభూషణ్‌ డా. కె.శ్రీనాధ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘లాయర్‌’ నిజాలను నిర్భయంగా రాసే పత్రికగా పేరెన్నికగన్నది. ప్రజాభ్యుదయ పత్రికగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటూ, గత 40 సంవత్సరాలుగా పత్రికారంగంలో తనదైన శైలితో ప్రజలకు, పాఠకులకు అక్షరసేవలందిస్తూ ఉంది అన్నారు.

 డిఆర్‌డిఓ ఛైర్మెన్‌ ` డా.జి. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ… ఇన్నేళ్ల పాటు ఒక పత్రికను నిర్వహించడం ఎంతో కష్టం. ఎంత కష్టమైనా సరే, చేసినప్పుడే గొప్పతనం. లాయర్‌ను గొప్పగా తీర్చిదిద్దుతున్న శివప్రభాత్‌కి నా అభినందనలు. ‘లాయర్‌’ ఇలాగే స్ఫూర్తివంతంగా నడుస్తూ..50 ఏళ్ళ పుట్టినరోజు పండుగను కూడా ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నా!… అన్నారు.

` రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాభ్యుదయమే లక్ష్యంగా ఏళ్ళతరబడిగా నిబద్దత నిజాయితీలతో ముందుకు సాగుతున్న ‘లాయర్‌’ 40వ వార్షికోత్సవ వేడుకలో భారత కీర్తిప్రతిష్టలకు పతాకగా నిలిచిన మన నెల్లూరీయుడు.. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విశిష్ట అతిథిగా పాల్గొనడం ఎంతో సంతోషదాయకం అన్నారు.

` తుంగా శివప్రభాత్‌రెడ్డి మాట్లాడుతూ… పాఠకుల ఆదరణతో..అండదండలతో నేటి తరానికే కాక భావితరాలకు కూడా మార్గదర్శకంగా ఉండేలా గత 40 ఏళ్ళుగా ఎన్నో చరిత్రాత్మకమైన, స్ఫూర్తివంతమైన అనుబంధ సంచికలను కూడా పాఠకులకు కానుకగా అందించింది. నేడు గౌరవ ఉపరాష్ట్రపతి మన వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆవిష్కరించ బడిన ‘విజయపథంలో నెల్లూరీయులు’ కాఫీటేబుల్‌ బుక్‌ కూడా ఆ వరుసలోదే. ఆ స్ఫూర్తి.. దీప్తి.. కీర్తి.. అన్నీ ‘లాయర్‌’ పాఠకులవే అన్నారు.

నెల్లూరుగడ్డపై జన్మించి ప్రపంచం నలుమూలలా తమ ప్రతిభాపాటవాలను చాటుతున్న 40 మంది విజయప్రస్థానాలతో పాటు, గడచిన తరంతో సహా రేపటి తరానికి కూడా స్ఫూర్తిని కలిగించిన మరో 40 మంది కీర్తిమూర్తుల గాధలను అక్షరబద్ధం చేసి ‘విజయపథంలో నెల్లూరీయులు’ పేరుతో సర్వాంగ సుందరంగా కాఫీటేబుల్‌ బుక్‌ని కూడా ఈ సందర్భంగా పాఠకులకు కానుకగా ‘లాయర్‌’ అందించింది.  

Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com