Banner
banner

”చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా” అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

వసంత పంచమి మహోత్సవాలు భారతదేశమంతటా ఘనంగా జరుగుతున్నాయి. చాలా దేవాలయలలో ఉదయమే సరస్వతి అమ్మ వారికి పండితులు శాస్త్రోక్తంగా అభిషేక పూజ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. అమ్మవారి ఆలయం వద్ద యజ్ఞ మండపంలో పండితులు ఛండీహోమం పూజ, సంకల్పం, పుణ్యవచనము, మహాపూజ వంటి పూజలు చేశారు. వసంత పంచమిని పురస్కరించుకొని అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ పర్వదినాన..ఈ పండగ గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

వసంత రుతువులోకి అడుగుపెడుతున్న వేళ వసంత పంచమిని జరుపుకోవటం మనకు అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అన్ని రుతువుల్లో కెల్లా వసంత రుతువుకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రుతువులో ప్రకృతి కొత్త రెక్కలు విచ్చుకుంటుంది. చూడడానికి చాలా కొత్తగా ఉండడంతో వసంత రుతువుని రుతువుల రాణిగా పిలుస్తారు. అందుకే మాఘ శుద్ధ పంచమిని ‘వసంత పంచమి’గా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండుగ కావడంతో, దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. అలాగే అదే వసంత పంచమి రోజున సరస్వతీ పూజ జరుపుకోవడం జరుగుతోంది.

 “మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః…’వసంత పంచమి రోజున ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని పూజించి విద్యారంభం చేయాలని చెప్పబడింది. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. చదువుల తల్లి కృపతో సద్భుద్ధినీ పొందుతారు. పసుపు పచ్చని బట్టలు ధరించి, సరస్వతికి రోజంతా పూజలు నిర్వహిస్తూ, కీర్తనలు పాడడం సనాతన సాంప్రదాయం.

ఈ పండుగ ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సరస్వతీ దేవితో పాటు సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి.  

వసంత పంచమి రోజున సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. అంతేకాదు..సకల సృష్టి కర్త అయిన బ్రహ్మదేవుడు కూడా వసంత పంచమి రోజున సరస్వతిదేవిని పూజిస్తాడు. సకల చరాచర సృష్టిని బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా సరస్వతీ దేవి ఉంది. బ్రహ్మదేవుడు తన  నాలుక పై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతోంది.  

సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ. అలాగే సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వాసం.

ఈ వసంత పంచమిని రాజస్థాన్‌లో విశేషంగా ఆచరిస్తారు. వంగ దేశంలో శ్రీ పంచమి పేరుతో నిర్వర్తిస్తారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వసంత పంచమి రోజున ఆచరించే ఒక విచిత్రమైన ఆచారం ఉంటుంది.  వసంత పంచమి రోజున తమ పిల్లల్ని పుస్తకాలకి దూరంగా ఉంచుతారు. కానీ సరస్వతి దేవి పూజలో కూర్చుంటారు. అలా పుస్తకాలని ముట్టకుండా ఉంచడమే దేవుడికి ఇష్టం అని నమ్ముతారు. ఈ రోజును మదన పంచమిగా రతీమన్మధులను పూజిస్తారు. దీనివలన దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయని నమ్మిక.

“యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితాయా వీణావరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజితా, సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః”

Banner
,
Similar Posts
Latest Posts from Vartalu.com