Banner
banner

ఉగాది పండుగను పురస్కరించుకుని రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేష క్లబ్‌ (సీఆర్సీ)   కళాపరిషత్‌ ఆధ్వర్యంలో సీఆర్సీ కళావేదికలో నిర్వహిస్తున్నారు.
తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన నాటకరంగం అంటే తనకు ప్రాణమని, అయితే సినిమాల్లోకి వెళ్లాక నాటకరంగానికి దూరమయ్యానే తప్ప పోగొట్టుకోలేదని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. 
రావులపాలెం సీఆర్సీ కళావేదిక ఆడిటోరియంలో ఆదివారం రాత్రి 20వ ఉగాది ఆహ్వాన రాష్టస్థ్రాయి నాటిక పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సినీనటులు కోట శ్రీనివాసరావు, నాజర్, ఎల్‌బి శ్రీరాం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ రంగస్థల నటుడు సుశీల్‌కుమార్ మిశ్రోను సీఆర్సీ కాటన్ కళాపరిషత్ కాటన్ కళా పురస్కారంతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని కోట శ్రీనివాసరావు, నాజర్ తదితరులు ఆయనకు అందించి మిశ్రో, సత్యలాదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. 
ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ… 20 ఏళ్లుగా సీఆర్సీ నాటకరంగానికి ప్రోత్సాహం అందిస్తూ ఇంత గొప్పగా పోటీలు నిర్వహించడం కళాకారులు చేసుకున్న అదృష్టమన్నారు. సీఆర్సీ కళాపరిషత్ గౌరవాధ్యక్షులు తనికెళ్ల భరణి సూచనతో తాను ఈ కార్యక్రమానికి హాజరయ్యానన్నారు. ఆఢపిల్ల పెళ్లి చేశాక అత్తవారింటికి వెళ్లి నిండు గర్భిణీగా పుట్టింటికి వచ్చి తల్లిని చూసిన సమయంలో ఎంత ఆనంద పడుతుందో అంత ఆనందాన్ని తాను ఈ వేదికపై పొందుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. కాటన్ కళా పురస్కారం అందుకున్న మిశ్రో నాటకాన్ని జీవితంగా మలుచుకున్న గొప్ప నటుడని ప్రశంసించారు. తన తమ్ముడు, సీఆర్సీ కాటన్ కళాపరిషత్ సలహాదారు కోట శంకరరావు ఈ పరిషత్ గురించి పలుమార్లు చెప్పాడని, నేడు ఆ గొప్పదనాన్ని చూస్తున్నానని అన్నారు. విద్వత్ ఉంటే సరిపోదని, సినీరంగంలో ఆవగింజంత అదృష్టం కూడ ఉండాలని కోట అన్నారు. తనకు ఆ అదృష్టం లభిస్తే తన తమ్ముడికి అది లభించలేదని, అతను కూడ గొప్ప నటుడని కితాబిచ్చారు.
 ఈ నాటిక పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైన నాటికకు స్వర్గస్థుడైన తన కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ పేరుతో రూ 5 వేలు నగదు పారితోషికంగా అందించాలని వేదికపై నిర్వాహకులకు ఆ సొమ్ము అందించారు. 
మరో ముఖ్య అతిథి నాజర్ మాట్లాడుతూ…. తన మిత్రుడు తనికెళ్ల భరణి చెబితే నమ్మలేదని, ఇక్కడకు వచ్చాక నాటక పోటీల నిర్వహణ చూస్తే చాలా సంతోషంగా, గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తాను వివిధ భాషల్లో 500 సినిమాలకు పైగా నటించానని, అయితే కోట శ్రీనివాసరావు వంటి గొప్ప నటుడిని ఏ భాషలోనూ చూడలేదన్నారు. సినిమాల్లో సూపర్ స్టార్లు కంటే రంగస్థల నటులే గొప్పవారన్నారు. ఉగాది పండగ రోజున ఇలాంటి పోటీలను నిర్వహించడం ఎంతో పుణ్యంతో కూడుకున్న కార్యక్రమం అన్నారు. సన్మానం పొందిన మిశ్రో, తాను దర్శకుడు కె బాలచందర్ శిష్యులమేనని, ఆయనను సన్మానించడం ఆనందంగా ఉందని చెప్పారు. 
ఎల్‌బి శ్రీరాం మాట్లాడుతూ …సీఆర్సీ నాటిక పోటీల్లో ఎన్నో ఏళ్లుగా తాను భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కె వెంకటేశ్వరరావు శిష్యుల్లో ఒకరైన మిశ్రో తనదైన శైలిలో నాటకాలు ప్రదర్శిస్తూ 70 ఏళ్లుగా నాటకరంగంలోనే జీవిస్తున్నారన్నారు.
 సన్మాన గ్రహీత మిశ్రో మాట్లాడుతూ… నాటకాల గురించి తెలియని వారు మొదట్లో తనను కించపరుస్తూ మాట్లాడేవారని, అయితే నాటకరంగంపై అభిమానంతో దశాబ్దాలుగా ఆ రంగంలోనే కొనసాగుతున్నానన్నారు.  సినీమాలు, టీవీ సీరియల్స్ వల్ల సమాజం చెడిపోయే అవకాశం ఉంది కానీ నాటకాల వల్ల ఏ మాత్రం లేదన్నారు. ప్రతి నాటకం ఒక సందేశం ఇస్తుందన్నారు. తాను నాటకాన్ని వీడితే మంచాన పడతానని, అంతగా నాటకం తన జీవితంలో కలిసి పోయిందన్నారు. 
ఈ సందర్భంగా సినీ గేయ రచయిత అదృష్టదీపక్‌ను కూడ ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను సీఆర్సీ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.  

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com