Banner
banner

మాట కంటే పాట గొప్పది. అందులోనూ సినిమా పాట. చెప్పాల్సిన దాన్ని సూటిగా, రాగయుక్తంగా, భావోద్వేగంతో చెప్పేస్తుంది. అందుకే కావ్యాలు, పద్యాలకు లేని ప్రఖ్యాతి పాటకు వచ్చింది. సినీ పాటను ప్రపంచం మెచ్చింది. జానపదుల పాటల నుంచి నేటి సినీపాటల వరకు జీవితాన్ని ఎంతో అద్భుతంగా పరిచయం చేసిన గేయ ప్రస్థానాన్ని సంస్కర్తలే కాకుండా ప్రభుత్వాలు కూడా విరివిగా వాడుకుంటున్నాయి. అలా పాటల తోటలో విహరించి, పాటలతోనే జీవితాన్ని మొదలెట్టి,ముగించారు సిరివెన్నెల. ఏముంది చాలా మంది సినిమా పాటలు రాసారు కదా… సిరివెన్నెల గారి గొప్పతనం ఏమిటి…ఎందుకు ఇంతలా ఓ సినీ రచయత స్వర్గానికేగితే ఎందుకింతమంది వీడ్కోలు సందేశాలు భారమైన గుండెలతో మోస్తున్నారు?

అందుకు కారణం ఒకటే అనిపిస్తుంది…ఆయన పాటలలో మన మనస్సు పసగట్టని  నిగూఢ తత్వం దాగి ఉంటుంది అనిపిస్తుంది. గాలివాలుగా ఓ గులాబివాలి గాయం ఐనది నా గుండెకి తగిలి..వంటి పద ప్రయోగాలు ఆయన పెన్ను నుంచి అలవోకగా జారిపోతూంటాయి. అందమైనవి కొన్ని , గాయం చేసేది మరికొన్ని.  ఆయన ఏ పాట రాసినా అభిమానులకు నచ్చుతుందేమో.. కానీ సీతారామశాస్త్రి గారి పేరు చెప్పగానే విధాత తలపున వంటి పాటలే చెప్తారు చాలా మంది. ఇక ఆయన్ని కలిసిన వారు చెప్పేది ఒకటే విషయం… ఆయన పాట వేర్వేరు కాదని. ఆయనలో పాటలున్నాయి, పాటల్లో ఆయనున్నారు అని చెప్పేస్తారు.

ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తూ ఓ అభిమాని…“నేల మీద మనలాగే ప్రాణులెన్ని ఉన్నా… పిలిచేందుకు, పలికేందుకు, చుట్టరికాలతో చుట్టుకునేందుకు ఎన్నెన్నో అందమైన వరసలు మనవేలే కన్నా” అని ఆయన ఓ పాటలో వ్రాసిన ఓ వాక్యముంది. అది కేవలం సినిమాకు వ్రాసిన వాక్యమే కాదు. అది ఆయన వ్యక్తిత్వం కూడా. తన దగ్గరికి వచ్చేవారందరినీ ఆయన తనను ఏదో ఒక వరస పెట్టే పిలవమంటారు. “మనిషి” అంటే చాలా చిన్న పదంలా కనిపిస్తుంది మనకు. కానీ అందులో ఉన్న లోతు గురించి, మనిషిగా భూమ్మీదికి వచ్చాక నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి, శోధించాల్సిన ప్రశ్నల గురించి అనర్గళంగా మాట్లాడగల జ్ఞానం ఆయనకుంది అని వవరిస్తారు. ఎంతో మంది అభిమానులను,ఆప్తులను సినిమాలకు అతీతంగా అందుకున్న అద్బతం ఆయన. ఆయనతో ఉండటం…నిజమైన సిరివెన్నెల్లో కూర్చున్నట్లు ఉంటుంది అంటారు.

మొదట నుంచి కాస్త ఎక్కువ ఫిలాసిఫీనే జోడిస్తూ వస్తున్నారు సీతారామశాస్త్రి. స్వప్నాల వెంట స్వర్గాల వేట – అంటూ దొంగాట సినిమాలో టైటిల్ సాంగ్ ని మర్చిపోవటం ఎవరి తరం. ఆ పాట  ఎంతో ఫిలసాఫికల్ గా ఉంటుంది.  ఇక “ కళ్ళార చూస్తూనే ఉంటారు అంత , హృదయానికే వేస్తారు గంత”, గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకు సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే , ప్రణయానికి నిలయం మనమై, యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే- తొలి ప్రేమ సినిమా లోని ఈ విరహ గీతం  ఓ తరాన్ని ఊపేయలేదూ. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల- నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కోసం ఎంతలా మురిసిపోలేదూ.

“స్త్రీల తనువులోనే శీలమున్నదంటే, పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లాళ్ళ దేహాలలో శీలమే ఉండదనా? భర్త అన్నవాడెవ్వడూ పురుషుడే కాడనా?” అంటూ పెళ్లి చేసుకుందారా సినిమా కోసం రాసిన పాట ఓ తరాన్ని ఆలోచనలో పడేసింది. ఇలా చెప్పుకుంటూ పోతో ఎన్నో…

ఆయన మన మధ్య లేరంటే …ఒకటే వాక్యం…ఆయన రాసిందే  …”నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి…కలే అయితె ఆ నిజం ఎలా తట్టుకోవాలీ….” అని…

 ఏదైమైనా తెలుగు ప్రజల మనసుల పైన సిరివెన్నెలజల్లులు కురిపించిన ఆయన్ని, ఆయన  పాటని ఇష్టపడని వారెవరు? మర్చిపోయేదెవరు…తెలుగు పాట,భాష ఉన్నంత కాలం ఆయన అనంతంలా ఆవరించే ఉంటారు. 

Banner
, , , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com