Banner
banner

 ఏటా మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి పర్వదినంగా, సూర్య జయంతిగా భక్తజనులు ఘనంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోన్న సంగతి తెలిసిందే.  సూర్యుడు అందరి దేవుడు. అందుకే అనాది నుంచి ఏడాదికోమారు ఈ రోజున సూర్య భగవానుని స్మరించుకుంటారు. అరసవిల్లి వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లి ఆయన నిజరూప దర్శనం చేసుకుంటారు.  మరో ప్రక్క రథసప్తమి సందర్భంగా తిరుపతిలో సప్త వాహనాలపై శ్రీవారు విహరిస్తారు. ఈ రోజు ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ జరుగుతుంది. ఈ పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రథ సప్తమి విశేషాలను ఓ సారి తలుచుకుందాం.

‘సూర్యుడి కంటే అధికమైన, శాశ్వతమైన దైవం మరొకరు లేరు. అతడి నుంచే సమస్తమైన జగత్తు ఆవిర్భవించింది. గ్రహాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు, మేషాది రాశులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినులు, ఇంద్రుడు, బ్రహ్మ, భూలోక భువర్లోక సువర్లోకాది సమస్త లోకాలు, పర్వతాలు, వృక్షాలు, నదులతో సహా ప్రాణి ప్రపంచమంతటి పుట్టుకకు సూర్యుడే కారణం. సూర్యుడి కన్నా శ్రేష్ఠమైన దైవం లేడు. ఉండడు. ఉండబోడు కూడా.’ అంటూ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా  ప్రకటించాడు.

హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటూంటారు. సూర్యుడు తన రథాన్ని ఆధిరోహించింది మాఘ శుద్ధ సప్తమినాడు. అలాగే సూర్యుడు మాఘశుద్ధ సప్తమినాడు జన్మించాడు. అందువల్ల ఈ పర్వదినాన్ని‘సూర్యజయంతి’  అని పిలుస్తారు. ఈ రోజుని  ఆయన పేరుతో కాకుండా.. రథసత్పమి అని పిలవడానికి కారణం ఉంది. అదేమిటంటే.. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకి ఉన్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది అందుకే ఆయన జన్మదినాన్ని ఆ రథంతో కూడి ఉన్న సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తూ.. రథ సప్తమి అని పిలుస్తాం..

అలాగే  రామాయణంలో సూర్య ప్రస్దావన ఉంది. రామ రావణ యుద్ధ సమయంలో అలసిన శ్రీరాముడికి అగస్య మహాముని ఆదిత్య హృదయం ను 30 శ్లోకాలుగా ఉపదేశించినట్లు  ఉంది. ఈ శ్లోకాలను పఠించినవారికి శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు దరిచేరవని నమ్మకం. ఆదిత్యుని ఆరాదిస్తే.. తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయని పెద్దల నమ్మకం. అందుకే చాలా మంది రథ సప్తమిపూట ఆదిత్య హృదయం పారాయణం చేస్తూంటారు.

ఇక ఈ రోజు ఏం చేయాలి….

 మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానమని.. అందుకనే ఆరోజు వేకువజామునే స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానం వంటి కార్యాక్రమాలను నిర్వహించాలి. అలా చేస్తే కనుక సప్త జన్మల పాపాలు నశించి.. ఆయురారోగ్య సంపదలను ఇస్తుందని నమ్మకం. ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడవడం ఆచారంగా వస్తుంది.

రథ సప్తమి రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి .. జిల్లేడాకులు, రేగుపండు తలపై పెట్టుకొని స్నానం చేయాలి అని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి “అర్కః” అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ‘జననీత్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే.. సప్తమ్యా హ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే’… అంటూ శ్లోకం చదివి, సూర్యునికి అర్ఘ్యమిచ్చి, ధ్యానం చేయాలి. అటు తర్వాత తల్లిదండ్రులు లేని వారైతే, పితృతర్పణం చేసి, చిమ్మిలి దానం చేయాలి.

నైవేధ్యం
ఆవు పేడతో చేసిన పిడకలమీద క్షీరాన్నాన్ని వండి సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. అలా క్షిరాన్నాన్ని చెరకు ముక్కతో కలుపుతూ తయారు చేయాలి. అలా వండిన దానిని నైవేద్యంగా సూర్యుడికి చిక్కుడు ఆకులలో వడ్డించి నివేదించాలి.

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు! తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్! మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే! సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!


Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com