పత్రికా సమాచార కార్యలయం (పిఐబి), విజయవాడ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ వి. రవి రామకృష్ణ ఈ తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన 1991 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. ఇప్పటి వరకు తన పదవీ కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన పదవులను అలంకరించారు. డిడి న్యూస్, ఆల్ ఇండియా రేడియో, పత్రికా సమాచార కార్యాలయం, బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్లో శ్రీ రవి రామకృష్ణ వివిధ హోదాలలో పనిచేశారు. డిడి న్యూస్ 24/7 ఛానెల్‌ను ప్రారంభించిన బృందంలోని కీలక సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. గతంలో కాబూల్‌లో ప్రసార భారతి కరస్పాండెంట్‌గా పనిచేసిన ఈయన, ఆఫ్ఘనిస్తాన్‌లో గందరగోళం, సంఘర్షణ సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి ప్రత్యేక నివేదికలను అందించారు. పిఐబి విజయవాడ లో బాధ్యతలు చేపట్టడానికి ముందు ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు న్యూఢిల్లీలోని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో పబ్లిసిటీకి సంబంధించిన కార్యకలాపాలు ఈయన ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగేవి.

శ్రీ రవి రామకృష్ణ విశాఖపట్నం వాస్తవ్యులు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదివారు. కళల పట్ల అపారమైన ఆసక్తి ఉన్న వ్యక్తి. ఈయనకు వీణావాద్యంలో ప్రత్యేక నైపుణ్యం ఉంది. సీనియర్లు, సహోద్యోగులు ఈయనను డైనమిక్ అధికారిగా అభివర్ణిస్తారు. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండేవారు. ముందుచూపుతో కూడిన మార్గదర్శకత్వం, నాయకత్వాన్ని అందించడంలో ఎంతో గొప్ప వ్యక్తి గా ఈయనకు పేరుంది. కలుపుగోలుతనంతో అందరితో కలివిడిగా ఉండే శ్రీ రవి రామ కృష్ణ ను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారులయిన ఆయన సహచరులు, జూనియర్లు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారు.
కేంద్ర సమాచార , ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ ఎల్. మురుగన్ శ్రీ రవి రామకృష్ణ కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేశారు.