Banner
banner

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  , ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రదానం చేశారు. విజయవాడ లోని ‘A’ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, అధికారులతో పాటు సీఎం మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కూడా హాజరయ్యారు. 2021 సంవత్సరానికి 59 అవార్డులు  ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 29 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, 30 వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేసారు. 9 సంస్థలకు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి 11 అవార్డులు ఇచ్చారు. అవార్డు గ్రహీతలలో సారస్వత నికేతన్‌ లైబ్రరీ – వేటపాలెం(ప్రకాశం) ఉంది.

 ‘సారస్వత నికేతనం’లో లభించని పుస్తకం అరుదు అని చెప్తారు! ఎందుకంటే… ‘సమగ్రాంధ్ర సాహిత్యా’నికే అది మూలాధారంగా చాలా కాలంగా నిలుస్తోంది. తొంభై ఏడేళ్ల ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రకు ప్రత్యక్షసాక్షి ఆ గ్రంథాలయం నిలుస్తూ వస్తోంది. ఈ శతాబ్ది కాలంలో ఈ లైబ్రరీని వేలాది మంది సందర్శించారు. వెలకట్టలేని విజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు.  సారస్వత నికేతనంలోని అపూర్వ గ్రంథాల వల్ల తెలుగు సాహితీలోకానికి జరిగిన మేలెంతో ఉంది. ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యా’నికి ఇక్కడే ఓ రూపం వచ్చింది. ఆయన నెలరోజుల పాటు చీరాలలో ఉండి  రోజూ గ్రంథాలయానికి వచ్చేవారు. ఇక్కడి అరుదైన గ్రంథాలను పరిశోధించేవారు. అలానే ‘సమగ్రాంధ్ర సాహిత్య’ రచన చేశారు. తొలి తెలుగు యాత్రా రచన ‘కాశీయాత్ర చరిత్ర’ (ఏనుగుల వీరాస్వామయ్య) ప్రతులు ఇప్పుడు లభిస్తున్నాయంటే అది వేటపాలెం గ్రంథాలయం వలనే జరిగింది. అందువల్లే ఈ అవార్డ్ కు ఈ సంస్దని ఎంపిక చేసారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం జగన్… కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డులను ఎంపిక చేసినట్లు తెలిపారు. నేలపై నుంచి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్ఆర్ అని.. అలాంటి వ్యక్తి పేరుమీద అన్ని రంగాల్లో తెలుగునేలకు పేరు తీసుకొచ్చిన వారిని గౌరవించుకునేందుకు ఈ అవార్డులిస్తున్నట్లు తెలిపారు. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ఎంపిక చేసినట్లు సీఎం తెలిపారు.

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి…. 1929లో చీరాల వచ్చిన మహాత్మాగాంధీ చేతుల మీదుగా ఈ లైబ్రరీకి చెందిన కొత్త భవనానికి శంకుస్థాపన జరిగింది. ఆ రోజు బాపూజీని చూడటానికి జనం వెల్లువెత్తారు. పెద్ద తోపులాట…! ఆ గందరగోళంలో మహాత్ముడి చేతికర్ర విరిగిపోయింది. దాన్ని ఆయన అక్కడే వదిలి వెళ్లారు. ఆ చేతికర్ర ఇప్పటికీ వేటపాలెం గ్రంథాలయంలో భద్రంగా ఉంది.ఏదైమైనా పుస్తకాభిమానులకు, ముఖ్యంగా పరిశోధకులకు పుణ్యస్థలం… వేటపాలెం సారస్వత నికేతనం. అటువంటి సంస్దకు అవార్డ్ అందచేయటం ఆ అవార్డ్ కే శోభ చేకూరింది. 

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com