
చలనచిత్ర, నాటక, కళా రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న ప్రముఖ నటుడు, రచయిత రావి కొండల రావు. ఆయన జయంతి ఈ రోజు. మొన్నటిదాకా మన మధ్య తిరిగిన వ్యక్తి హఠాత్తుగా స్వర్గ యాత్ర ప్రయాణం పెట్టేసుకుంటే…ఆయన గురించి జయంతి అంటూ నాలుగు వాక్యాలు రాయాలంటే మనసొప్పదు. ఎందుకంటే ఆయన ఇంకా మనతో హాయిగా మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. మన ఫోన్ కాల్స్ కు,మన వాట్సప్ చాట్స్ కు రిప్లై ఇస్తున్నట్లే అనిపిస్తుంది. ఆయన ఇంటికి వెళితే ఆయన రాసిన పుస్తకాలు గురించి చెప్తూ…మధ్యలో పాతరోజుల్లోకి వెళ్లి ఉషారుగా ఆ విశేషాలు ముచ్చటించుకుంటున్నట్లే అనిపిస్తుంది. మర్చిపోతేనే కదా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవటానికి. మరణమే ఇలాంటి సమస్యలు తెచ్చి పెడుతుంది. ఆయనకు మరణం లేదు ,ఉందన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
అలనాటి మేటి నటుల సినిమాల నుంచి.. నేటి యువ నటుల చిత్రాల దాకా ఆరు దశాబ్దాలపాటు వెండితెరపై తనదైన నటనతో అలరించిన ఈ విలక్షణ నటుడు ని ఏదో ఒక టీవీ ఛానెల్ లోనో, యూట్యూబ్ లోనో నిత్యం పలకరిస్తూనే ఉంటారు . బృందావనం, భైరవద్వీపం చిత్రాలకు ఆయన రాసిన అద్భుతమైన సంభాషణలు వింటున్నప్పుడో.. పెళ్లిపుస్తకం లాంటి సూపర్‌హిట్ సినిమాని చూస్తూ ఆ కథని మెచ్చుకుంటున్నప్పుడో రావి కొండలరావుగారు ఠక్కున మన ముందు ప్రత్యక్ష్యమైపోతారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడిగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా చెరగని ముద్ర వేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించిన ఆయన సినీ ప్రేక్షకులకు తెలుగు భాష ఉన్నంతకాలం శాశ్వతంగా గుర్తుండిపోతారు. కాబట్టి జయంతిలు, వర్ధంతిలు మనకోసమే..ఏదో ఆ వంకన మళ్లీ ఆ తెలుగు మాస్టారుని మన మనస్సులో పలకరించుకోవటానికే..అంతే..అంతకు మించి ఏమీలేదు.
రావి కొండలరావు గారు 600కుపైగా చిత్రాల్లో నటించారు. ఆయన కెరీర్లో ‘తేనె మనసులు’, ‘దసరా బుల్లోడు’, ‘రంగూన్ రౌడీ’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘వరకట్నం’, ‘అందాల రాముడు’, ‘రాధా కళ్యాణం’, ‘చంటబ్బాయి’, ‘పెళ్ళిపుస్తకం’, ‘బృందావనం’ ‘భైరవ ద్వీపం’ ‘రాధాగోపాలం’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘కింగ్’, ‘ఓయ్’, లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన భార్య దివంగత రాధాకుమారి కూడా సినిమా నటే. ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించారు.