Banner
banner

‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’, ‘నటరత్న’, ‘కళాప్రపూర్ణ’, ‘తెలుగు జాతి ముద్దుబిడ్డ’, ప్రపంచవ్యాప్త తెలుగువారంతా ఆప్యాయంగా పిలుచుకునే ‘అన్న’ . అంతేనా అభిమానుల పాలిట ‘దైవం’.. స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’గారు. ఆయన 25 వ వర్దంతి ఈ రోజు. ఓ వ్యక్తిని తరతరాలు పాటు స్మరించాలంటే ఏ స్దాయి ఉండాలి. అంతకు రెట్టింపే అన్నగారికి ఉందనేది అందరూ ఒప్పుకునే సత్యం. మరో 100 సంవత్సరాల తర్వాత 125 వర్దంతిని జరుపుతారు అభిమానం తెలుగు జనం. ఎందుకంటే ఆయన తెలుగు జాతికి ఇచ్చిన ఉత్తేజం అలాంటిది.

నటుడుగా ఎంత ఎత్తుకు ఎదిగారో..రాజకీయ నాయకుడుగానూ అంతకు మించి అందరి మన్ననలూ పొందారు. ఎన్టీఆర్‌‌ జీవితం గురించి అందరికి తెలిసింది చాలా తక్కువే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన జీవితంలో జరిగిన మలుపుల గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. ఇక ఆయన జీవిత అంశాల ఆధారంగా వచ్చిన సినిమాలలో కూడా అన్ని వివరాలు చూపించలేదు. అయితేనేం ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకంలా మనందరికీ అనిపిస్తుంది…కనిపిస్తుంది.

సినిమాలను తన రాజకీయాలకు రహదారిగా మార్చుకున్న ఎన్టీఆర్, తన సినిమాల్లో పాటలతో ఉపయోగకరమైన సందేశాలు, దేశభక్తి భావాలు అందించే ప్రయత్నం చేసేవారు. మానవ సంభంధాలు, కుటుంబ అనురాగాలు, ధర్మం, న్యాయం, చట్టం అన్నిటినీ తన సినిమా పాటల్లో స్పృశించటానికి ప్రయత్నించేవారు. అప్పట్లో ఎన్టీఆర్ తెరపై కనపడి సోలోగా ఓ పాట ఎత్తుకున్నారంటే థియోటర్స్ దద్దరిల్లేవి. నిరక్షరాస్యులలో కూడా అక్షర జ్ఞానాన్ని మించిన ఆలోచనలు కలిగేవి. “జన్మభూమి నా దేశం నమోః నమామి, పుణ్య భూమి నా దేశం సదా స్మరామి” అంటూ తన కెరీర్ చివరి వరకూ దేశాన్ని స్మరిస్తూనే ఉన్నారు.

ఇక రాజకీయాల్లోకి వచ్చాక ఆయన సాధించిన రికార్డ్ లు బోలెడు. 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ పార్టీ ప్రచారం నిమిత్తం 90 రోజుల్లో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. అది ఒక ప్రపంచ రికార్డుగా అభివర్ణిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి కావటం ఓ పెద్ద రికార్డే. అంతెందుకు ఆయన లో పట్టుదల ఏ స్దాయిది అంటే…40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన డాన్స్ నేర్చుకున్నారు.

ఇక పట్టుదలలో ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన శైలి…ఆయన ఎంతో ఇష్టపడి చేసిన ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలోని ఒక సీన్ ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే… ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి 3 ఏళ్ళ తరువాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు.

నందమూరి తారకరామారావు గారి 25 వ వర్ధంతి సందర్భంగా తెలుగు 100 మనఃపూర్వక నివాళులు…అర్పిస్తూ ‘జోహర్ అన్న యన్ టి ఆర్ జోహార్’

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com