ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అప్పట్లో సంగీత,నృత్య ప్రధాన చిత్రాలు వచ్చేవి. తర్వాత జంధ్యాల గారు సైతం ఓ సినిమా చేసారు. ‘స్వర్ణకమలం’ ‘సాగర సంగమం’ . ‘ఆనందభైరవి’ ఈ తరంలో కూడా వివిధ మాధ్యమాల ద్వారా ఆదరణ పొందుతున్నాయి. ఆ తర్వాత కాలంలో అలాంటి సినిమాలు తగ్గిపోయాయి. అప్పుడప్పుడూ హీరోయిన్ ఇంట్రడక్షన్ గానో లేక ఆమె భరతనాట్యం చేస్తూనే ఓ పాట పెట్టేవారు. తర్వాత కాలంలో అదీ పోయింది. అలాగని జనాల్లో నిజంగా అలాంటి సినిమాలపై ఆసక్తి తగ్గిందని చెప్పలేం. అలాంటి సినిమాలు తీసేవారు లేకే తగ్గిపోయాయి అనాలి. అయితే రీసెంట్ గా తన ట్రైలర్స్ తో ఎట్రాక్ట్ చేసింది ‘నాట్యం’. అప్పటి రోజులను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రం ఓ వర్గానికి బాగా నచ్చుతోంది. ఇంతకీ ఈ సినిమాలో కంటెంట్ ఏమిటి…ఈ జనరేషన్ కు నచ్చే అంశాలు ఏమున్నాయో చూద్దాం.

కథ
అదో నాట్య గ్రామం. అక్కడ దాదాపు అందరూ క్లాసికల్ డాన్సర్సే. ఆ ఊళ్లో ఉండే సితార (సంధ్యా రాజు) కు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. ఆమె ఊహ నృత్యం.. ఆమె ధ్యాస నృత్యం.. ఆమె మదిలో నృత్యం.. ఆమె క్రియలో నృత్యం.. ఆమె ఆశయం నృత్యం.. ఆమె భావన నృత్యం.. ఆమె గమ్యం నృత్యం.. మనసా వాచా కర్మేణా నృత్యం. అలా నృత్యంతో జీవితం పెనవేసుకుపోయిన ఆమె జీవితంలో ఓ కల..కోరిక. అదేమిటంటే…తన తన గురువు (ఆదిత్య మేనన్) తనకు బోధించిన కాదంబరి కథను ఎప్పటికైనా అందరి ముందు ప్రదర్శించాలని. అయితే ఆ కథను ఎవరు నృత్య రూపంలో చెప్పాలనుకున్నా వారి ప్రాణాలు పోతూంటాయి. గతంలో గురువు గారి భార్య మరణకూడా అలాగే సంభవించిందని చెప్పుకుంటూంటారు. దాంతో సితార కోరికకు ఆమె గురువు అడ్డు చెప్తారు. కానీ సితార అలా వెనకడుగు వేసే వ్యక్తిత్వం కాదు. ఈలోగా ఈమెకు సిటీలో ఉండే రోహిత్(రోహిత్ బెహాల్) అనే వెస్ట్రన్ డ్యాన్సర్ పరిచయం అవుతారు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏమిటి…ఈ కాదంబరి ఎవరు..ఆమె కథ ని చివరగా నృత్య రూపకంగా ఆమె ప్రదర్శించిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నాట్యం మన సంస్కృతీ, సాంప్రదాయాలకు, మన పురాణాలకు, కథలకు, అలవాట్లకు, అద్దం పడుతుంది. ‘బ్రహ్మ, సృష్టించిన ఐదవ వేదంగా ‘నాట్యశాస్త్రము’ పరిగణించ బడింది. ‘నాట్యము’ చరిత్ర నుండి, ఇతిహాసాలనుండి ఆహ్లాదకరంగా రూప కల్పన చేయడమే కాక, ఉన్నతమైన ఆలోచనలు కలిగించుననీ, ‘నాట్యమున’ కనబడని జ్ఞానము గాని, విద్య కాని, కల గాని, యోగము గాని, ఖర్మ గాని లేదు’ అని నాట్యశాస్త్రములో ప్రస్తావించారు. …. మంచి, చెడు వ్యత్యాసములను, ప్రపంచ తీరు తెన్నులను కూడా, నాట్యము ఎత్తి చూపుతుంది. ఈ సినిమా చూస్తూంటే అవన్నీ నిజమే అనిపిస్తాయి. నాట్యం ప్రధానంగా నిజాయితీగా చేసిన ఓ ప్రయత్నంగా ఈ సినిమా ని చూస్తే నచ్చుతుంది. అలా కాకుండా ఓ కమర్షియల్ వెంచర్ గా ఈ సినిమాని పరిశీలిస్తే చాలా లోపాలు కనిపించవచ్చు. కళలు కేవలం ఆహ్లాదాన్ని, ఆనందాన్నిఅందించే కార్యక్రమాలుగానే మిగిలిపోవాల్సిన అవసరం లేదని అర్దం చేసుకుంటే ఈ సినిమా పై మంచి గౌరవం కలుగుతుంది.

ఇక సితార పాత్రకు పూర్తి న్యాయం చేసారు కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. యాక్టింగ్ పరంగా ఓకే అనిపించుకున్నా.. నృత్య విషయంలో మాత్రం తన నేర్పరితనం కనపడింది. స్వతహాగా ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్ కావడమే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. గురువుగా ఆదిత్య మీనన్ అద్బుతంగా సెట్ అయ్యారు. ఇక క్లాసికల్ డ్యాన్సర్ హరిగా కమల్ కామరాజు, వెస్ట్రన్ డ్యాన్సర్ రోహిత్‌గా రోహిత్ బెహాల్ మెప్పించారు. ఊరి పెద్దగా శుభలేక సుధాకర్, హీరోయిన్ తల్లిగా భానుప్రియ తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నికల్ గా …
ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ శ్రవణ్ భరద్వాజ్ సంగీతం. పాటలతో పాటు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించాడు. పాటలు కూడా కథలో భాగంగా నడిచాయి. సినిమాటోగ్రఫీ అద్బుతం అనలేం కానీ . ఎడిటింగ్‌పై ఇంకాస్త షార్ప్ గా చెయ్యాల్సిందనిపిస్తుంది.
ఫైనల్ గా …
మనస్సుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవే లలిత కళలు. చక్కని పాటకి, అందమైన ఆటకి స్పందించని మనస్సు ఉండదు. మన సామాజిక వ్యవహారాలని, కట్టుబాట్లని ప్రతిబింబిస్తూ…మన భావి తరాల వారికి, మన సంస్కృతీ సాంప్రదాయాలపై అవగాహన, ఆసక్తి కలిగించడం ఎలా? అనే విషయాల కోణంలోంచి చూస్తే ఈ సినిమాని మన కుటుంబంతో చూడాలి, ముఖ్యంగా మన పిల్లలు చూపించాలి. మన జీవనవిధానంలో సంస్కృతీ, సాంప్రదాయాలు సహజంగా ఉన్నాయనే విషయం పిల్లలకు చెప్పినట్లు అవుతుంది. ఏదైమైనా కొత్త కాన్సెప్ట్ తో కూడిన సి నిమాలు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాల్సిన భాధ్యత ఉంది.