Banner
banner

బాపు, రమణ  ఈ పేరు వినగానే, గోదారి గలగలలు, అచ్చ తెలుగు సినీ కథల రాదారులు గుర్తొస్తాయి. పొడవాటి వాలుజడ, వేలాడుతున్న జడగంటలు, నుదుటన ఎర్రని బొట్టు పెట్టుకున్న పదహారణాల తెలుగమ్మాయిల అందాల బొమ్మలు, లావుపాటి పిన్నిగార్లు, బంగారంలాంటి బామ్మలు, కొంటెంగా నవ్వేసే బుడుగులు కలగలపిన తెలుగు కార్టూన్ లు,సూటిగా మనస్సుకు తగిలే పదాలు, జీవితాలని కాచి వడపోసిన కోతి కొమ్మచ్చి వాక్యాలూ గుర్తొస్తాయి. వీరిద్దరి కలబోతలో సినిమా అంటే తెలుగుదనం, తెలుగు జీవితం, తెంపరితనం, తుంటరితనం,అమ్మాయి ధైర్యం..ప్రతీ ఇంటి రాధా గోపాలం.  కొన్నేళ్లపాటు తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కార్టూన్ ప్రపంచాన్ని,సినీ పరిశ్రమను ఊపిన ఈ తెలుగువారిద్దరూ కొన్నేళ్ల క్రితం ఈ ప్రపంచాన్ని వీడి, స్వర్గాన్ని చేరి అక్కడ తెలుగుదనం నింపే పనిలో ఉన్నారు.

తెలుగు సినిమాలో తెలుగు వారి జీవితం ఉండవచ్చని,తప్పేమి కాదని నిరూపించిన ఈ మిత్రులిద్దరి విగ్రహాలను గోదావరి ఒడ్డున గ్రాండుగా గతంలోనే ఆవిష్కరించారు. రాజమండ్రిలోని గోదావరి గట్టుపై శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల నిర్మాణం కొత్తపేట కు చెందిన ప్రముఖ శిల్పకళా నిపుణులు కళారత్న డి.రాజకుమార్‌వడయార్‌ గారు  చేశారు.

ఇప్పుడు హఠాత్తుగా ఈ తెలుగువాళ్లద్దరినీ గుర్తు చేసుకున్నారెందుకు అనే కదా మీ సందేహం.. అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఈ రోజు ఉదయం పది గంటలకి అలంకృత ప్రాంగణంలో బాపు రమణ గార్లకి పుష్పాంజలి ఘటించారు బాపు-రమణల అభిమానులు .. వివేక్ నరసింహం గారు (చార్టెడ్ అకౌంటెంట్- హైదరాబాద్) ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు!! అదీ ఈ రోజే ఏంటి స్పెషల్ అంటారా..ఈ రోజు రమణ గారి 10 వ వర్ధంతి.

అందమైన అమ్మాయికి మారుపేరు ‘బాపు బొమ్మ’. బాపు రమణతో కలిసి సృష్టించిన బుడుగు, సీగాన పెసూనాంబ, రెండుజెళ్ళ సీత, అప్పుల అప్పారావు, గిరీశం, లావుపాటి పెళ్ళాం-బొచ్చుకుక్క లాంటి బుజ్జి మొగుడూ… వీరంతా ఈ రోజు  గుర్తుకు చేసుకుందాం!!


 ‘కొంటె బొమ్మల బాపు, కొన్ని తరముల సేపు, గుండె ఊయల లూపు, ఓ కూనలమ్మా’ : ఆరుద్ర 

ఈ సందర్భంగా  రాజమండ్రి లో  బాపు రమణ ల ఘన  నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం   ఫోటోలు చూడండి 

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com