Banner
banner

ఉగ్రవాదం, ఇతర హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజానికీ గాంధీ ప్రవచించిన అహింస ఆచరణీయమని మన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. గాంధీ కేవలం భారత్‌కే చెందడని, ఆయన ప్రపంచ మానవాళికి భారత్‌ అందించిన గొప్ప బహుమతి అని అభివర్ణించారు. మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటైన జాతీయ కమిటీ ప్రథమ సమావేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ కలిసి ప్రసంగించారు. ఈ సంవత్సరం అక్టోబర్‌ 2 నుంచి మహాత్ముడి 150వ జయంతి వేడుకలు ప్రారంభమవనున్నాయి.  
కోవింద్ మాట్లాడుతూ..‘మహాత్ముడే మన భూత, భవిష్యత్తు, వర్తమానం. ఆయన నేర్పిన సిద్ధాంతాలు, విలువలను ప్రపంచవ్యాప్తం చేయడమే మనముందున్న కర్తవ్యం. గాంధీ మనదేశంలో పుట్టినా కేవలం భారత్ దేశానికే పరిమితంకాదు. మానవాళికి భారత్‌ ఇచ్చిన గొప్ప కానుక గాంధీ. 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావం చూపిన భారతీయుడాయన. నైతిక విలువలకు ఆయన నిలువుటద్దం. గాంధీజీ 150వ జయంతి అంటే గొప్ప వ్యక్తి జీవితం గురించి ఉత్సవం చేసుకోవడంకాదు…  చరిత్రను గుర్తుచేసుకోవడం. ఆయన ఆలోచనల్లో కొన్ని… కాలంకంటే ఎంతో ముందుంటే, మరికొన్ని ఇప్పటి కాలానికి అతికినట్లు సరిపోతున్నాయి.
 కులరహిత సమాజం గురించి మాట్లాడితే మనకు ఆయనే గుర్తొస్తారు. స్వచ్ఛభారత్‌, మహిళలు, పిల్లలు, బలహీనవర్గాల హక్కుల గురించి మాట్లాడినప్పుడు మన మనసులో ఆయనే మెదలుతారు. దేశంలోని చిట్టచివరి ఇంటికి విద్యుత్తు వెలుగులు అందించేందుకు ప్రయత్నించినప్పుడూ ఆ వెలుగుల్లో గాంధీయే కనిపిస్తారు. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను విశ్వ ఉత్సవంగా నిర్వహించాలి. ఐక్యరాజ్యసమితితోపాటు విభిన్న అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకోవాలి. మన దృష్టి కేవలం కార్యక్రమాల నిర్వహణకే పరిమితం కాకూడదు. సామాన్య ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే కార్యాచరణను చేపట్టాలి’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. భవిష్యత్‌ తరాలకు కూడా మహాత్ముడు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రధాని మోదీ కోరారు. ‘కార్యాంజలి’ థీమ్‌ నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను రూపొందించాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధీ చూపిన మార్గంలో పరిష్కారాలున్నాయన్నారు.  
ఇక ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ సీనియర్‌ నేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు, 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చైనా మేధావి క్వాన్‌యూ షాంగ్, అమెరికన్‌ గాంధీగా పేరుగాంచిన బెర్నీ మీయర్‌ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాల రూపకల్పన కోసం ప్రధాని నేతృత్వంలో 125 సభ్యులతో ఒక కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు.  

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com