Banner
banner

దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్ముడి గురించి మాట్లాడుకోవటానికి, చదవటానికే మాకు టైమ్ లేదు..ఇంకా ఆయన భార్య గురించి ఏమి చదువుతాం అంటారా.  అయితే మీరు చాలా అంటే చాలా చాలా మిస్సైనట్లే. కస్తూర్బా గురించిన ఈ చిన్న పుస్తకం చదివితే మీరు వెంటనే ఆమె జన్మించిన ఇంటికి వెళ్లి సాష్టాంగపడి నమస్కారం పెట్టాలనుకుంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం మనకు లేదే అని బాధపడతారు. అలాగే మహాత్ముని ప్రతీ అడుగులో ఆమె ముద్ర చూసి విస్మయపడతారు. అవును.. ‘150 సంవత్సరాల కస్తూర్బా గాంధీ’ పేరుతో వచ్చిన పుస్తకం ఎంత వివణాత్మకంగా ఉంటుందంటే ..మహాత్మునితో ఆమెకు వివాహం కాకముందు ఎలా కలిసి ఆడుకునేవారు..మేయర్ ఆమె తండ్రికు, దివాన్ అయిన గాంధీ తండ్రికు ఉన్న పరిచయం ఏమిటో వంటి ఆశ్చర్యపరిచే వివరాలు అందిస్తుంది. పోరుబందర్ మేయర్ కుమార్తెగా ఆమె పుట్టి పెరిగిన సంపర్న కుటుంబ నేపధ్యం ఏమిటి…ఆమె గాంధీ ఇంటికి కాపురానికి వచ్చేసమయానికి అక్కడ పరిస్దితులు ఎలా ఉండేవి,అప్పటి పరదా సంస్కృతిని కళ్ల ముందు ఉంచుతుంది.

kasturiba gandhi autobiography

అలాగే ఈ రోజు మనం గాంధీను గుర్తు చేసుకుంటూ పాడుకుంటున్న ‘ఈశ్వర్ అల్లా తేరేనామ్’ గీతానికి, ఆమె అత్తింట ఉన్న ప్రణామీ సంప్రదాయనికి సంభంధం ఏమిటి వంటి అరుదైన విషయాలు అత్యంత స్పష్టంగా వివరిస్తుంది. హఠాత్తుగా మహాత్ముడుకు బారిస్టర్ కోర్స్ లండన్ వెళ్లి చదివాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆయన కుటుంబాన్ని వెలి ఎందుకు వేసారు. అలాగే ఆయన బారిస్టర్ చదువుకోసం లండన్ వెళ్తూంటే కస్తూర్బా తన బంగారం ఇచ్చి ఎలా సాయిం చేసింది. ఆ తర్వాత కాలంలో ఆయన ఆవిడ బంగారాన్ని తిరిగి విడిపించి ఇచ్చారా. అంత చదువుకుని వచ్చి మళ్లీ దక్షిణాఫ్రికాకు గాంథీ ఎందుకు వెళ్లటం వెనక కుటుంబ అవసరాలు ఏమిటి . తరతరాలుగా వస్తున్న దివాన్ ఉద్యోగం గాంధీని ఎందుకు వరించలేదు, గాంధీ భార్యగా ఆవిడ ఆనందంగా గడిపారా..మహాత్ముని సహధర్మచారిణి అయ్యినందుకు ఆమె గర్వించేవారా..లేదా వంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో మనకు కనపడతాయి. అన్నిటికన్నా ఆసక్తికరమైన అంశం తన 74 వ ఏట చదువుకోవాలని విద్యార్దినిగా ఆమె చదువు మొదలెట్టడం వెనక ఉన్న నేపధ్యం..ఆ చదువు అర్దాంతరంగా ముగియటం. ఈ అధ్యాయం చదివితే గాంధీ మీద కోపం రావటం ఖాయం. ఇలా ఒకటేమిటి..చాలా విషయాలు ఈ పుస్తకంలో అడుగడుగునా కనపడి మనం..దాదాపు గాంధీ ఇంట్లోనే ఆయనతో పాటు ఉన్నట్లు అనిపిస్తాయి.

కస్తూర్బా జీవితంలో చాలా అధ్యాయాలు మన జీవితాల్లో ఏదో ఒక పార్శాన్నేదో గుర్తుచేస్తాయి.  తేలికగా చదివించేసినా… మనసులో ఏదో మూల స్థిరపడిపోతాయి. అందుకు కారణం కస్తూర్బా జీవితంలో అసలు మనం ఊహించని ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉండటమే.  ముఖ్యంగా పెద్ద కొడుకు హరిలాల్ గురించి ఆమె మాతృహృదయం ఎంత తల్లడిల్లిపోయిందో అక్షరబద్దం చేసిన తీరు ఆనాటి సంఘటనను మన కళ్లముందే ఉంచుతుంది. కాలేజీలో చదువుకోవాలని లండన్ వెళ్లి బారిస్టర్ గా తిరిగిరావాలనీ కన్న కలలు నెరవేకపోవటంతో ఇల్లు విడిచిపోయి,తండ్రితో వైరం పెంచుకుని కుటుంబంతో అన్ని బంధాలూ తెంచుకున్నాడు హరిలాల్. ఆ తర్వాత గాంధీతో కలిసి కస్తూర్బా జబల్ పూర్ కు వెళ్తున్నప్పుడు అతను స్టేషన్ బయిట దాదాపు యాచక స్దితిలో కనపడినప్పుడు ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిందో చదువుతూంటే కళ్లు చెమ్మగిల్లకమానవు. నారింజకాయ పట్టుకుని ఆ కుర్రాడి ఆ తల్లి ముందు నిలబడ్డ తీరు ..అలా మీ మనస్సులో స్ధిరంగా నిలిచిపోతుంది. మహాత్ముడైనా కుటుంబ విషయంలో మామూలు మానవుడే..మనలాంటివాడే అనాలనిపిస్తుంది.

ఈ పుస్తకంలో చాలా వాక్యాలు ఆమె  మనస్తత్వాన్ని పట్టిస్తాయి. వెంటాడతాయి. ఆమె ఉన్న ఇంటినైనా చూసి రమ్మని పరుగెట్టిస్తాయి.స్వతంత్ర్యం ముందునాటి గుజరాతీ బనియాల జీవితం ఎలా ఉండేది అన్న నోస్టాల్జియాలా సాగుతుంది. మరోవైపు… నాటి పరిస్దితులను గుర్తుచేసి చరిత్రను నమోదు చేస్తుంది. అప్పటి పరిస్దితుల్లో మహిళల జీవితం ఎలా ఉండేది. మహాత్ముడు తన భార్యను ఎలా చూసుకున్నారు, గాంధీజీకు తన పిల్లలతో అనుబంధం ఎలా ఉండేది. పెద్ద కొడుకు ఎందుకు మతం మార్చుకుని , ఇల్లు వదిలిపోయారు…లాంటి సవాలక్ష మనకు తెలియని మహాత్ముని జీవిత వివరాలు కనిపిస్తాయి.  ఇది ఓ మనిషి బతుకుచిత్రం కాదు. ఓ తరం దాటి వచ్చిన వారధి. ఆయన సహచరి వైపు నుంచి మహాత్ముని అస్తిత్వాన్ని మరికాస్త తరచిచూడాలనుకునే వాళ్లకి ఓ అమూల్యమైన కానుక. సౌదా అరుణ రాసిన ఈ పుస్తకం ఆమె జీవితంపై వచ్చిన ఓ అరుదైన,వెలకట్టలేని అద్బుతం. మీకూ  చదవాలనిపిస్తోంది కదూ…  ఇదిగో పుస్తకం పొందే మార్గం

Click here to buy this book online

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com