Banner
banner

సంక్రాంతి అంటే… ఏదో ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు. మూడు రోజులు కుటుంబమంతా కలిసి సంతోషంగా చేసుకునే పండగ. కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండుగ ఇది. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, ఇక మూడో రోజు కనుమ. పంట చేతికి రావడానికి రైతులు ఎంత కష్టపడతారో  పశువుల అదే స్దాయిలో కష్టపడతాయి. యజమాని సంతోషం కోసం అవి ఎంతగానో శ్రమిస్తాయి.  ఇలా తమ సంపదలకూ, సంతోషాలకూ కారణమైన పశువులను కృతజ్ఞతతో పూజించడమే కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే కనుమ రోజును ‘పశువుల పండుగ’ అంటారు.

భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ… అన్నీ కలిస్తేనే పెద్దపండగ! కానీ, దాని గురించి ఎవరేం మాట్లాడుకున్నా భోగి, సంక్రాంతిలతో ఆగిపోతారు. అయితేగియితే ‘పశువుల పండగ’ అని మాత్రమే కనుమను  గుర్తుంచుకుంటారు. ఇక ఇప్పటికీ కనుమ రోజు… రైతన్నలు ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఆ రోజు ఎలాంటి పనీ చేయించరు. ఉదయమే పశువులను చెరువులకు, నదీ తీరాలు లేదా చెరువుల దగ్గరికి తీసుకెళ్లి శుభ్రంగా కడుగుతారు. నుదుట పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి… వాటి మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు. తర్వాత వాటికి హారతి ఇచ్చి పూజ చేస్తారు. కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు. కొంత ఆ పొంగలిని తమ పొలాల్లో చల్లుకుంటారు.  అలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు.

ఇక కనుమ పండుగ ద్వాపర యుగం నుంచే జరుపుకుంటున్నట్లు పురాణాల్లో ఉంది. అప్పట్లో శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తాడు. అలా గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణమైన గోవర్ధనగిరితో పాటు తమ సుఖసంతోషాలకు కారణమైన గోవులకు కనుమ రోజున పూజ చేసేవారు. అప్పట్నుంచి ఇప్పటివరకు సంక్రాంతి మరుసటి రోజున కనుమ పండుగ జరుపుకుంటున్నారని చెప్తారు.  రైతులు తమకు పండిన పంటను తామే కాకుండా పశుపక్ష్యాదులతో పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. అయితే, ‘కనుమ రోజున కాకులు కూడా కదలవు’ అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతుంటారు.  

అంతేకాదుూ చనిపోయిన పెద్దలు కూడా ఇదే రోజున బయటకు వస్తారనీ.. వారిని తలచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. కనుమ రోజు పెద్దలకు ప్రసాదం పెట్టడంతో పాటు ఇంట్లో వాళ్లు కూడా తినేందుకు మాంసాహారం వండుతారు. కనుమ రోజున మినుములు తింటే మంచిదన్న ఉద్దేశంతో ఆ రోజు గారెలు చేసి మాంసాహారం వడ్డిస్తారు. మినుములు చలికాలంలో వేడిని పెంచేందుకూ ఉపయోగపడతాయి.

 అలాగే పల్లెప్రజలు కనుము పండుగను సంక్రాంతి పార్న అని పిలుస్తారు. ‘పారణ’ అనే పదానికి రూపాంతరమే పార్న. పారణ అంటే వ్రతం, ఉపవాసం  తరువాత తీసుకునే తీర్థప్రసాదాలు. ఈ అర్థం ఇప్పుడు పూర్తిగా మారి మాంసాహార విందుభోజనంగా మిగిలిపోయింది. ఇక  కనుమ రోజు కచ్చితంగా తలస్నానమాచరించి సూర్యభగవానుడిని పూజించడం, ఆదిత్యహృదయ పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తారు. ఈ రోజు ఇంటి బయట రథం ముగ్గు వేసి సూర్య భగవానుడి రథాల గుర్తుగా దాన్ని భావిస్తారు. కనుమ రోజు గారెలు వేసి భగవంతుడికి నైవేద్యం పెట్టడం సంప్రదాయం.

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com