చిత్తంబు మధురిపు శ్రీ పాదములయందే
పలుకులు హరిగుణ పఠనమందే
కరములు విష్ణుమందిర మార్జనములందే
శ్రవములు హరికథా శ్రవణమందే
చూపులు గోవింద రుపవీక్షణమందే
శిరము కేశవనమస్క్రుతులయందే
ఎన్నో ధర్మ సందేహాలు..కానీ వాటికి సరైన సమాధానమిచ్చేదెవరు..ఆ శక్తి, ఆసక్తి ఉండేదెవరికి. అంటే అది కొద్ది మంది పుణ్యాత్ములు, మహానుభావులకే అని చెప్పాలి. అటువంటి మనకాలానికి చెందిన ఓ అరుదైన ధర్మ ప్రచారకులు..బహు పురాణ వాజ్మయ అనువాదకులు కందాడై రామానుజాచార్య స్వామి. ఆయన తన జీవితకాలంలో ఎక్కువ భాగం ధర్మాచరణకు, ధర్మ అనుష్టానికి,ధర్మ ప్రచారానికి వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ వయస్సులో కూడా ఓపిక చేసుకుని BhakthiTV వారికి ధర్మ సందేహాలతో పాటు, గోదామృతం అంటూ గోదాదేవి ఇరువైఎనిమిదవ పాశురాలను చాలా సరళమైన భాషలో ,సామాన్యుడుకి అర్దమయ్యేలా చెప్తున్నారు. వినేవారి చెవుల్లో అమృతం పోస్తున్నారు. వారి హృదయాల్లో భక్తిని నింపుతున్నారు. ఆయన భక్తి భావనలకు తాజాగా ఓ సత్కారం జరిగింది
పెద్ద జీయర్ స్వామి శిష్యుడు శతాధిక గ్రంథకర్త గోపాలాచార్యస్వామి జ్ఞాపకార్థం ఏటా గోపాలోపాయన పురస్కారాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీరామనగరంలో చినజీయర్ స్వామి బహు పురాణ వాజ్మయ అనువాదకుడు కందాడై రామానుజాచార్య స్వామి, ఉభయ వేదాంత సంప్రదాయనిష్ఠులు శిరిశినహల్ వెంకటచార్యలకు జ్ఞాపికలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. భారతీయ వేదాలు, గ్రంథాలు, పురాణాలను సంరక్షించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరముందని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అన్నారు.