దాదాపు 5 వేల సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుడు, భక్తుడైన అర్జునుడిని ప్రోత్సహించడానికి చెప్పిన మాటలనే ‘భగవద్గీత’ గా చెప్తారు. ‘శ్రీమద్ భగవద్గీత’ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన, విస్తృతంగా అధ్యయనం చేయబడిన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటి. కురుక్షేత్ర యుద్ధభూమిలో సందిగ్ధంలో పడిన అర్జునుడికి సత్యాన్ని, తత్త్వాన్ని, వివేకాన్ని బోధించడానికి దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు నినదించిన ఓ గొప్ప ఆధ్యాత్మిక గీతం ‘భగవద్గీత’ ని అభివర్ణిస్తారు. జీవితసత్యాలను అర్థం చేసుకోవడానికి, మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా గడపడానికి గీతాధ్యయనం అతిగొప్ప సాధనం. ఈ అతి గొప్ప గ్రంధాన్ని ఇప్పుడు అంతరిక్షంలోకి పంపుతున్నారు.
వివరాల్లోకి వెళితే… వచ్చే నెల చివర్లో ఓ ప్రైవేట్ శాటిలైట్ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో పాటు ఓ భగవద్గీత కాపీని, 25 వేల మంది పేర్లను అంతరిక్షంలోకి తీసుకుపోనుంది. ఈ శాటిలైట్‌కు సతీష్ ధావన్ లేదా ఎస్డీ శాట్ అనే పేరు పెట్టారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) ద్వారా ఈ శాటిలైట్‌ను పంపించనున్నారు. ఈ శాటిలైట్‌ను స్పేస్ కిడ్జ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఇది విద్యార్థుల్లో స్పేస్ సైన్స్ ను ప్రోత్సహించే సంస్థ. ఈ శాటిలైట్ మరో మూడు పేలోడ్స్ ను కూడా తీసుకెళ్లనుంది. ఇందులో ఒక పేలోడ్ స్పేస్ రేడియేషన్‌ను, ఒకటి మాగ్నెటోస్పియర్‌ను అధ్యయనం చేయనుండగా మరొకటి లోపవర్ వైడ్ ఏరియా కమ్యూనికేషన్ నెట్వర్క్ కోసం పంపిస్తున్నారు.
తమ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లే క్షణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు స్పేస్ కిడ్జ్ ఇండియా సీఈవో డాక్టర్ శ్రీమతి కేశన్ చెప్పారు.