Banner
banner

గొబ్బియల్లో… గొబ్బియల్లో…
పూవు పూవు పూసిందంట
ఏమీ పువ్వు పూసిందంట
రాజావారి తోటలో జామ పువ్వూ పూసిందంటా
అవునా.. అట్టా.. అక్కల్లారా…
చంద్రగిరి భామల్లారా …

తెలుగు వారి ఇళ్లలో పండగ అంటే సంస్కృతి, వారసత్వం,   జీవిత నేపథ్యం..అన్నిటినీ మించి  ప్రకృతితో పరిచయం. మనమంతా  ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. ఇప్పటికీ పల్లె ప్రజలకు ఇదొక మధురానుభూతి. భోగి, సంక్రాంతి, కనుము పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకునే వేడుకల్లో మన ప్రాచీన సంప్రదాయ కళా ప్రదర్శనలు, విందులు, వినోదాలు నిండి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ పండగ మూడు రోజడులు తెలుగు నేలంతా సందడే సందడి. సంక్రాంతి రోజుని పెద్ద పండగ అంటారు.భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి.. సాగరులకు శాప విమోచనం చేయించింది ఈ రోజే అని శాస్త్రాలు చెబుతున్నాయి.

‘సంక్రాంతి’ అంటే ‘ప్రవేశించడం’ అని అర్థం. జగాలకు జవజీవాల్ని, వెలుగును ప్రసాదించే జాతిరత్నమైన సూర్యుడు దక్షిణాభిముఖుడై ప్రయాణం చేసి పుష్యమాసంలో ఉత్తరాభిముఖుడై ప్రయాణాన్ని సాగిస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండగను మకర సంక్రాంతి అంటారు. పెద్ద పండగ, పొంగలి పండగ అని కూడా పిలుస్తారు.

సంక్రాంతి అంటే ఒకప్పుడు నెలపైన మూడు రోజులు అంటే…33 రోజులు పాటు ఘనంగా జరుపుకునేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పులతో  ప్రస్తుతం ఈ పండుగను 3 రోజులపాటు మాత్రమే నిర్వహించుకుంటున్నారు. మకర సంక్రమణం అంటే పాత పోయి కొత్తదనానికి స్వాగతం పలికే రోజు అని అర్థం.పుష్య మాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సంక్రాంతే మనకు పర్వదినం. ఆ రోజే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమౌతుంది. ఈ పర్వదినాలలో విష్ణు మూర్తిని ఆరాధిస్తాం. సంక్రాంతి రోజున మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ. ఈరోజున సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, దేవతలు, పితృదేవతలకు దానాలు చేస్తూంటాము.

అలాగే సంక్రాంతి అంటే.. ఆడబిడ్డల హడావుడి, అల్లుళ్ల సరదా అలకలు, బావామరదళ్ల సరాగాలతో తెలుగు లోగిళ్లు కళకళలాడిపోతూంటుంది. సంక్రాంతిలక్ష్మికి ఆతిథ్యమిచ్చే అందమైన కాలమిది. బంతిపూల వరసలు, గొబ్బిపాటలు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు… సంక్రాంతి వేళ తెలుగునాట కనపడే ఆ హడావిడే వేరు. పండుగ రోజున గడపకు పసుపు పెట్టి.. కుంకుమ పెట్టడం, వాకిట్లో ముగ్గులు వేసి.. వాటిలో ఆవు పేడ గొబ్బెమ్మలు పెట్టడం.. ఇంట్లో పిండివంటలు, పరమాన్నం చేసి శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం మన ఆనవాయితీగా వస్తోంది.

అలాగే  సంక్రాంతికీ కోడిపందేలకూ అవినాభావ సంబంధం. పల్లెలోని మగవారు ఊరికి సమీపంలోని తోపుల్లో చేరి కోడిపందేలు ఆడతారు.  కోళ్లరంగును బట్టి కాకి, డేగ, నెమలి వంటి వివిధపేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం కోడిపందేలపై నిషేధం ఉన్నా సంక్రాంతి సందర్భంగా అక్కడక్కడ ఆడుతూనే ఉన్నారు.

కోళ్ల పందెమాడినారు గొబ్బియల్లో – కోలాటమాడినారు గొబ్బియల్లో
పల్లెలోని రైతులంతా గొబ్బియల్లో – పార్వాటమాడినారు గొబ్బియల్లో
చందమామ వెన్నెల్లో గొబ్బియల్లో – చెమ్మచెక్క లాడినారు గొబ్బియల్లో
సంకురాతిరి లక్ష్మివచ్చె గొబ్బియల్లో – చల్లగాను దీవించె గొబ్బియల్లో
గొబ్బియల్లో గొబ్బియల్లో… గొబ్బియల్లో…

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com