
“హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర..”
ఇదే నిన్నంతా సందడి.. శుక్రవారం మహా శివరాత్రి కావడంతో దేశం అంతటా శివనామ స్మరణతో మారుమోగింది. శివపార్వతుల కల్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. శివుడు అభిషేక ప్రియుడు, ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. వేకువ జాము 3 గంటల నుంచే గుడుల వద్ద క్యూ కట్టారు. అభిషేక ప్రియుడైన శివుడికి బిల్వ పత్రాలు, రకరకాల నైవేద్యాలతో ఆరాధన చేశారు భక్తులు.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్వామి క్షేత్రాలు భక్తజన సంద్రంగా మారాయి. రాత్రి లింగోద్భవ కాలంలో చాలాచోట్ల స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరగింది. ప్రజలు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించటంతో…. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఈ నేపధ్యంలో వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు మట్టితో శివ లింగాలు, ప్రమిదలు రూపొందించి ఆలయ ప్రాంగణాల వద్ద జాగరణ పాటించారు. పవిత్ర నదీ తారాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రజా ప్రతినిధులు,మంత్రులు సైతం ప్రత్యేక పూజలు నిర్వ హించి, మొక్కులు చెల్లించుకున్నారు