దేశవ్యాప్తంగా 108, 104 అంబులెన్స్ సహాయ సేవల వ్యూహకర్త, ప్రెస్‌క్లబ్ సీనియర్ సభ్యుడు డాక్టర్ అయితరాజు పాండు రంగారావు (75)ఇక లేరు. కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ సోమాజీగూడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. . పంజగుట్ట హిందూశ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈయనకు డాక్టర్ భరత్ అనే కుమారుడు ఉన్నారు.
రంగారావు గారి స్వస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామం. డాక్టర్ ఏపీ రంగారావుకు భార్య కరుణ, కుమారుడు డాక్టర్ భరత్ ఉన్నారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రంగారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన మృతి దేశానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఇటీవలి తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన పంచాయతీ రాజ్ చట్టం రూపకల్పనలో తన విలువైన సూచనలు, సలహాలు అందించారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారావు సేవలను గుర్తు చేసుకున్నారు.
అందరికి ఆరోగ్యమే లక్ష్యంగా ఆరోగ్య సమాజ స్థాపనకు ఎంతోగానో కృషి చేశారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మంత్రులతోపాటు ముఖ్యమంత్రి సీపీఆర్వో జ్వాలా నరసింహారావు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్, విశ్రాంత ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో వైద్యులు, ప్రముఖులు రంగారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మధ్యాహ్నం పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
రంగారావు మృతిపై సీఎం సంతాపం
రంగారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించడానికి, ప్రభుత్వపరంగా వైద్య సేవలను మెరుగు పర్చడానికి ఎ.పి.రంగారావు కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు.
ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. రంగారావు కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేదలకు వైద్యసేవలందించడానికి, ప్రభుత్వపరంగా వైద్య సేవలు పెంచడానికి ఏపీ రంగారావు జీవితాంతం కృషి చేశారని సీఎం కొనియాడారు.
రంగారావు గారి మృతికి తెలుగు 100 సంతాపం తెలియచేస్తోంది.