Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1
రణ్ వీర్ సింగ్
ఈ రోజు బాలీవుడ్ క్రేజీ హీరో రణవీర్ సింగ్ పుట్టిన రోజు. ఖాన్‌, కపూర్‌ల హవా నడిచే బాలీవుడ్‌లో తన నటనతో బాక్సాఫీసు దగ్గర కొత్త రికార్డుల సృష్టిస్తున్న ‘గల్లీబాయ్‌’. అంతేకాదు, అందాల రాశి దీపికా పదుకొణె మనసు దోచుకున్న లవర్‌బాయ్‌ కూడా.ఈ హీరో ప్రత్యేకత ఏంటంటే…రొటీన్ ని ఎప్పుడూ ఇష్టపడడు  ఎప్పటికప్పుడు తనను తాను నిరూపించుకుంటుంటాడు.విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గోవిందా, సల్మాన్‌ లాంటి హీరోల పక్కా మాస్‌ సినిమాల్ని చూసి హీరో కావాలని కలలుగన్నాడు. కానీ పెద్దవుతున్నకొద్దీ అదెంత కష్టమో అర్థమవుతుండేది. తల్లిదండ్రులు సినిమాల్లో ఉంటే పిల్లలు సినిమాల్లోకి వెళ్లడం సులభం. అలా లేనివారికి కష్టమే. అందుకని ఆలోచనల్ని మార్చుకున్నాడు. అమెరికా వెళ్లి ఇండియానా యూనివర్సిటీలో బీఏ కాపీరైటింగ్‌ విభాగంలో చేరాడు. దాంతోపాటు యాక్టింగ్‌ క్లాసులకీ వెళ్లే ఛాన్స్‌ వచ్చింది. యాక్టింగ్‌లోని మజాని ఆస్వాదించేవాడు. అప్పుడే అనిపించింది ‘సినిమాల్లో ప్రయత్నించకపోవడం కరెక్ట్‌ కాదు… అవకాశాలు రావడం, రాకపోవడం తరవాత, ప్రయత్నమైతే చేసి తీరాలి’ అని. అమెరికా నుంచి వచ్చాక కాపీ రైటర్‌గా ముంబయిలో ఓ యాడ్‌ ఏజెన్సీలో చేస్తూ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’కి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఆఫీసుకి వెళ్లాను. నిర్మాత ఆదిత్య చోప్రాకి మొదటి సీన్‌లోనే నచ్చేశాడు. కానీ డైరెక్టర్‌ మాత్రం నాలుగైదు సీన్లు చేయించాకగాని ఓకే చెప్పలేదు. 2010లో వచ్చిన ఆ సినిమా అతనికి శుభారంభాన్ని ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాలోని నటనకు గాను, ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడిగా పురస్కారాన్ని అందుకున్నాడు.  రెండో సినిమా ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బాహల్‌’ కూడా మంచి హిట్‌. కానీ అందులోఈ హీరో  పాత్ర మొదటి సినిమాకి దగ్గరగా ఉంటుంది. ఇలా అయితే అందరిలో తను ఒకణ్ని అయిపోతాననిపించింది. అప్పట్నుంచీ ఏ పాత్ర కూడా అదివరకు చేసిన ఛాయలు కనిపిస్తే చేయలేదు . ఛాలెంజింగ్‌గా ఉండేవే ఎంచుకునేవాడు. లుటేరా, రామ్‌లీలా, బాజీరావ్‌ మస్తానీ, బేఫిక్రే, పద్మావత్‌, సింబా, గల్లీబాయ్‌ లాంటి విభిన్నమైన సినిమాలు చేశాడు. ‘పద్మావత్‌’ విజయవంతమైన తర్వాత చాలామంది ఈ హీరో నటనను మెచ్చుకున్నారు. తర్వాత ‘సింబా’, ఇప్పుడు ‘గల్లీబాయ్‌’… హ్యాట్రిక్‌ హిట్లు. అలా ఈ హీరో ప్రస్తానం కొనసాగుతూనే ఉంది.

2  మంగళంపల్లి బాలమురళీకృష్ణ

 ప్రఖ్యాత కర్ణాటక సంగీత గాయకుడు, వయొలిన్ విద్వాంసుడు, వాగ్గేయకారుడు, సినీ సంగీత దర్శకుడు, గాయకుడుమంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా ఇదే రోజున జన్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ అతను ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నారు. ఆయన వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించారు. పలు చిత్రాలకు అతను సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు. ప్రపంచ స్థాయిలో చేవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి అందుకున్నారు.  

3 సింగర్ మాళవిక
 ఈ రోజు ఓ సింగర్ కూడా జన్మించింది. ఆమే మాళవిక. గంగోత్రి, శ్రీరామదాసు, ఏక్ నిరంజన్, బిల్లా, సింహా, వరుడు,రాజన్న వంటి చిత్రాల్లో సినిమాల్లో సూపర్ హిట్ పాటలు పాడింది. మణిశర్మ, కీరవాణి వంటి ప్రముఖ సంగీత దర్శకులు ఆమెను ప్రోత్సహించారు. చిన్నతనంలోనే తన తల్లి వద్ద సంగీత శిక్షణ తీసుకున్నది. ఈమె తల్లి ఒక సంగీత ఉపాధ్యాయురాలు కావటం కలిసొచ్చింది.   విశాఖపట్నం ఆమె నేటివ్ ప్లేస్. చిన్నప్పటి నుంచీ సంగీత వాతావరణం మధ్య పెరిగింది.  విశాఖపట్నం, చుట్టుపక్కల జరిగిన అనేక పాటలపోటీలలో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నది. సినీరంగంలో అవకాశాలు పెరగడంతో వీరి కుటుంబం హైదరాబాదుకి మకాం మార్చి సింగర్ గా తన ప్రస్దానాన్ని కొనసాగిస్తోంది.

4. మాలతి

అలాగే మన తరానికి ఇన్సిప్రేషన్ గా నిలిచిన మాలతి కూడా ఇదే రోజున జన్మించింది. మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన ఆమె చిన్నతనంలో పక్షవాతంకు గురి అయ్యింది.  బ్రతుకుతుందా అనే స్థితి నుండి, బ్రతికితే ఆమె భవిష్యత్ ఏమిటి అనే పెద్ద ప్రశ్నతో పెరిగి పెద్దదైంది.ఎంతలా అంటే  15సంవత్సరాల్లో ఆమె 27 ఆపరేషన్లు చేయించుకుంది.అయినా ఆమె మానసిక ధైర్యం గొప్పది. బెంగుళూరులో జరిగిన వికలాంగుల క్రీడా పోటీలలో మొదటిసారి మాలతి పాల్గొని  రెండు బంగారు పతకాలు సాధించింది. అలాగే ఈమె వికలాంగుల క్రీడా పోటీలలో పాల్గొని 100 మీటర్లు, 200వ మీటర్ల వీల్‌ఛేర్‌ పరుగు పందాలలో తన ప్రతిభ కనబరచింది, వీల్‌ ఛైర్‌లో కూచునే బ్యాడ్‌మింటన్‌, షాట్‌ ఫుట్‌ విసరటం, డిస్క్‌త్రో, జావ్‌లిన్‌ విసరటం వంటివి ప్రాక్టీస్ చేసి వాటిలో అనేక బంగారు పతకాలు గెలుపొందినది. ఈమె ప్రతిభ ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది. 1989లో డెన్మార్క్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలలో 4 బంగారు పతకాలు అందు కొన్నది. పలు దేశాలలో జరిగిన ఆటల పోటీలలో పాల్గొని ఇప్పటికీ 158 బంగారుపతకాలతోపాటుగా 20 రజితపతకాలుకూడా పొందారు. క్రీడారంగంలో అత్యధిక పతకాలను గెలుచుకొన్న వికలాంగ వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.
1999లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం, మాలతికృష్ణమూర్తిని ‘విశ్వశ్రేష్ట మహిళ’గా గౌరవించింది. భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. క్రీడాశాఖ అర్జున అవార్డుతో సత్కరించింది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి 

Banner
,
Similar Posts
Latest Posts from Vartalu.com