Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1.. విజయ్ శేఖర్ శర్మ

ఈ రోజు మనం నిత్యం మన సెల్ ఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకుని వాడే పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ పుట్టిన రోజు. ‘పేటీఎం’ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఫోర్బ్స్ ఫార్చ్యూన్స్ జాబితాలో యువ భారతీయ కుబేరుడిగా నిలిచారు. అండర్ – 40 లీగ్‌లో యువ కుబేరుడిగా నిలిచిన విజయ్ శేఖర్ శర్మ ఆస్తి రూ.1700 కోట్లు పైమాటే. ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మొబైల్ వాలెట్ ‘పేటీఎం’ను విజయ్ శేఖర్ శర్మ 2011లో స్థాపించారు. తర్వాత దాన్ని ‘ఈ – కామర్స్’ బిజినెస్ వేదికగా ‘పేటీఎం మాల్’, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు చేశారు.2016 నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అవినీతిని అరికట్టేందుకు ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అత్యధికంగా లబ్ధి పొందిన సంస్థల్లో ‘పేటీఎం’ ఒకటి. ఇప్పటివరకు 25 కోట్ల మంది వినియోగదారులు తమ పేర్లు నమోదు చేసుకోగా, రోజూ 70 లక్షల మంది వినియోగదారులు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ‘పేటీఎం’లో విజయ్ శేఖర్ శర్మకు 16 శాతం వాటా ఉంది.ఒక వైపు డిజిటల్ పేమెంట్స్ సేవలను అందిస్తూనే… పేటీఎం ఆర్థిక సేవలని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. అదే సమయంలో పేటీఎం క్లౌడ్ సేవలను కూడా విస్తరించే పనిలో పడింది. దేశంలోనే ఈ కంపెనీ పేమెంట్ గేట్వే సేవలు అందించటంలో ముందుంటుంది. అనేక ప్రభుత్వ రంగ టిక్కెటింగ్ సంస్థలు కూడా పేటీఎం సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇవన్నీ విజయ్ శేఖర్ శర్మ ఒంటిచేత్తో నడుపుతున్నారు.

2
ఈ రోజు ప్రముఖ సినీ కథా రచయిత, మాటల పండితుడు,దర్శకుడు అయిన డి.వి.నరసరాజు పుట్టిన రోజు. సినిమా ఇండస్ట్రీవారికి ఆయనంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఎన్టీఆర్ , ఆ తర్వాత రామోజీరావు గారు ఆయన్ని తెగ ఇష్టపడేవారు. జెంటిల్‌మన్’ అనే పదానికి సరైన నిర్వచనం డి.వి.నరసరాజు అనేవారు. ‘‘సినిమాల్లో ఉంటూ ఈర్ష్య, అసూయలు లేకుండా తన పనిని సక్రమంగా నిర్వహిస్తూ చెప్పిన తేదీకి స్క్రిప్టు చేతికి అందించే రచయిత నరసరాజు’’ అని బి.ఎన్.రెడ్డి చెబుతూ ఉండేవారు. నరసరాజు రాసిన ‘నాటకం’ అనే నాటక ప్రదర్శన చూసి, కె.వి.రెడ్డి ఆయన రచనాచమత్కృతికి ఆకర్షితులై, సినిమాకి రాయమని ఆహ్వనించారు. అదే వాహినివారి ‘పెద్దమనుషులు’ (1954). చమత్కారాలతో కూడిన సంభాషణలు రాయడంతో నైపుణ్యం ఉందని గ్రహించి, ‘పెద్దమనుషులు’ అలాంటి వ్యంగ్య కథ కాబట్టి నరసరాజు సరిపోతారన్న ఆలోచన కె.వి.కి కలిగింది. నాటక రచన వేరు, సినిమా రచన వేరూ గనక, కొన్ని నెలలపాటు చర్చలు చేసి స్క్రీన్‌ప్లే రాయడం అయిన తర్వాత నరసరాజు సంభాషణలకి ఉపక్రమించారు. ఆ సినిమా హిట్. దాంతో ఆయనకు అన్నపూర్ణవారి తొలి చిత్రం ‘దొంగరాముడు’కు స్క్రిప్టు రాసే అవకాశం వచ్చింది.

‘దొంగరాముడు’ ఘన విజయం సాధించడంతో నరసరాజుకి అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే, ఆయన చాలా జాగ్రత్తపరుడు గనక, దర్శకుడు, సంస్థని బట్టి ఒప్పుకునేవారు. ‘స్కేప్ గోట్’ అనే రచన ఆధారంగా ఆయన కథ అల్లి ‘రాముడు భీముడు’ అని పేరు పెట్టారు. సురేష్ సంస్థ స్థాపించి, రామానాయుడు ఆ కథని చిత్రం తీసి, విజయం సాధించారు. తర్వాత తమిళంలోనూ హిందీలోనూ ఆ కథనే తీస్తే అక్కడా విజయాలు సాధించింది. ఆయన రచనలో కృత్రిమత్వం కనిపించదు. సంభాషణలు కృతకంగా ఉండవు. అశ్లీలం, అసభ్యం ధ్వనించవు. హాస్యం బాగా పండిస్తారు. సాంఘికమే కాకుండా, పురాణం, జానపదం కూడా రాశారాయన. చదువుకుంటున్నప్పుడు తెలుగు ముఖ్య భాష గనక, భారత భాగవతాది పురాణాలు బాగా చదివారు. కొన్ని సినిమాలు: ‘భక్తప్రహ్లాద’, ‘గుండమ్మకథ’, ‘నాదీ ఆడజన్మే’, ‘రంగులరాట్నం’, ‘గృహలక్ష్మి’, ‘రాము’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘ఆలీబాబా నలభై దొంగలు’, ‘బడిపంతులు’, ‘తాతమ్మకల’, ‘శ్రీరంగనీతులు’, ‘బృందావనం’ మొదలైనవి. ‘కారుదిదిద్దన కాపురం’ (1986) సినిమాకి దర్శకత్వం వహించారు. ఒకటిరెండు చిత్రాల్లో పాత్రధారణ చేశారు.

3 దుర్గాబాయి దేశ్‌ముఖ్

అందరూ మనిషులుగానే పుడతారు.. కానీ కొందరు మాత్రమే మహామనుషులుగా నిలుస్తారు. సమాజంలో వేనూళ్లుకున్న స్వార్థం.. నేను, నావాళ్లు.. అనే పదాలకు పూర్తి భిన్నంగా మేము మావాళ్లు అనే భావనతో సమాజంలో మార్పుకు.. సంఘహితం కోసం చేసిన కార్యక్రమాలకు తమ సొంత డబ్బులు, అస్తులు కూడా అమ్మి నేటికి ఆ కార్యక్రమాలతో మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోయిన వారే మహనీయులు. అలాంటి వారిలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఒకరు. ఆమె పుట్టిన రోజు ఈ రోజు.

సేవాదృక్పథం, ముక్కుసూటితనం, అడ్డంకులకు వెరవక దూసుకుపోయే ధీర లక్షణం… ముమ్మూర్తులా కొలువైన వ్యక్తిత్వం దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ది. రాజమండ్రికి గాంధీజీ వస్తున్నారు. ఆయన రాకను పురస్కరించుకొని వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ‘దేశం కోసం నా వంతుగా ఏదైనా చేయాలి’ అనే తపన అందరిలోనూ కనిపించింది. పన్నెండేళ్ల దుర్గాబాయిలో కూడా ఆ తపన కనిపించింది. వయసుకు మించిన ఆలోచన ఆమె కళ్లలో కాంతిలా ప్రతిఫలించింది. తన పసి చేతులతో విరాళాలను సేకరించి గాంధీజీకి అందించింది. అంతేకాదు… తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా తీసి మహాత్ముడికి విరాళంగా ఇచ్చేసింది.

మిడిల్ క్లాస్ కుటుంబంలో రాజమండ్రిలో జన్మించిన దుర్గాబాయి దేశభక్తురాలిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా… తన కాలంలో మరెవరూ చూపని ధైర్యసాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు. స్వాతంత్య్ర సమరంలో, ఉప్పు సత్యాగ్రహంలో టంగుటూరి ప్రకాశంపంతులు, దేశోద్ధారకుని కాశీనాధ నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలసి ఈమె పనిచేశారు. తరువాత దుర్గాబాయి భారత రాజ్యాంగ రచనాసంఘం సభ్యురాలిగా, ప్లానింగ్ కమీషన్ మెంబరుగా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌గా, బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా పనిచేశారు. నెహ్రూ, అంబేద్కర్‌వంటి నాయకులతో కలిసి పనిచేసిన ఆమె స్త్రీలకు న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా కృషిచేశారు.

4 కె.కామరాజ్
తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కె.కామరాజ్ . భారత రత్న పురస్కార గ్రహీత అయన ఈయనకు ఈ రోజు జన్మదినం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ప్రధానమంత్రి చెయ్యటంలో ఈయన పోషించిన పాత్రకు గాను భారత రాజకీయాలలో కింగ్‌మేకర్‌గా పేరొందాడు. ఆయన రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అఖండ విజయంతో గెలుపొందింది. అప్పటికే అనేక ఇబ్బందులతో, గొడవలు గొడవలుగా విడిపోయిన ఉన్న జాతీయ కాంగ్రెస్‌ను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్థుడిగా ఉన్న కామరాజ్ గొప్ప పోరాట యోధుడు. 1930లో మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. అనేక సందర్భాలలో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో 8 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. ప్రజల నుండి వచ్చి, పెద్దగా చదువుకోకున్నా ప్రజల జీవితాలను చదివినాడు కామరాజ్. నిరుపేద కల్లుగీత కుటుంబంలో పుట్టిన ఆయన ప్రజల కోసమే జీవితం అంకితం చేసి, పెళ్ళి కూడా చేసుకోలేదు. ఆయన రాజకీయ శక్తిగా ఎదగడానికి కారణం చిన్నతనం నుండి రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండడమే అని చెప్తూండేవారు. ఈయన అనుయాయులు అభిమానముతో ఈయన్ను దక్షిణ గాంధీ, నల్ల గాంధీ అని పిలిచేవారు.కామరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యను, పాఠశాలలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి అనేక లక్షలమంది గ్రామీణ పేదప్రజలకు విద్యావకాశము కల్పించినందుకు నేటికీ ప్రశంసలందుకున్నాడు.

5 Mohammed bin Rashid Al Maktoum

షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ రోజే జన్మించారు. ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరిటేట్స్ ,దుబాయ్ కు వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, రాజు. ఆయన ఈ రోజు మనం చూస్తున్న మోడ్రన్ దుబాయి ఎస్టాబ్లిషన్ మెంట్ కు ఆద్యుడు. ఈ రోజున దుబాయి..ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవటం వెనక ఆయన కృషే ఉంది. పైలెట్ గా ట్రైనింగ్ తీసుకున్న ఆయన దుబాయి పోలీస్ ఫోర్స్ కు, దుబాయి డిఫెన్స్ ఫోర్స్ కు కొంతకాలం హెడ్ గా ఉండి లోగుట్టులన్నీ అధ్యయనం చేసారు. తండ్రి తదనంతరం దుబాయి కు మొదట మంత్రిగా ఎంచుకోబడ్డాడు. ఆయన సోదరుడు దుబాయి కు రాజుగా ఆయన్ని ప్రకటించారు. ఆ తర్వాత దుబాయి రూలర్ గా మారారు. ఆయన కాలంలో మహ్మద్ బిన్ రషీద్ స్కూల్స్, ఎయిర్ లైన్స్, ఆకాశాన్ని తాకే భవంతలు నిర్మించారు. ఆయనకు తొమ్మిది మంది కొడుకులు, 14 మంది కుమార్తెలు, ఆరుగురు భార్యలు.

  1. డా.కె.ఎల్.రావు
    నేడు తెలుగుబిడ్డ,ప్రముఖ ఇంజనీర్ కీర్తి శేషులు డా.కె.ఎల్.రావు గారి జన్మదినము. ఆయన రాసిన పుస్తకాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో టెక్స్ట్ బుక్ గా పెట్టుకున్నారంటే ఏ స్దాయి వ్యక్తో ఊహించండి. డా. కానూరి లక్ష్మణరావుగారు స్వతంత్ర భారతదేశపు గొప్ప ఇంజనీర్. నీటిపారుదల సాంకేతిక విజ్ఞానంలో, నదుల అనుసంధానంలో భారతదేశ నదీ నదాల స్వరూపావగాహనలో ఈ మహనీయుడికి తెలీని విషయాలు లేవు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. ఫాదర్ అఫ్ వాటర్ మేనేజ్మెంట్ గా ఆయన్ను మన దేశం గౌరవించింది. ఆయన ప్లానింగ్ ల వల్ల కోట్లాది భారతీయ రైతుల కు లబ్ధి చేకూర్చాడు. మూడు సార్లు విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రేసు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు . ఈయన నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీల మంత్రివర్గములలో పది సంవత్సరాల పాటు కేంద్ర నీటిపారుదల మరియు విద్యుఛ్ఛక్తి శాఖా మంత్రిగా పనిచేశారు . అనేక భారి ఆనకట్టల యొక్క రూపకల్పనలో ఈయన పాత్ర ఉన్నది. ఈయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలములో అనేక జలవిద్యుఛ్ఛక్తి మరియు నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పన చేశారు . ప్రపంచములోనే అతిపెద్ద మట్టితో కట్టిన ఆనకట్ట నాగార్జునసాగర్ ఈయన రూపకల్పన చేసినదే. మొదటి నాలుగు పంచవర్ష ప్రణాళికా కాలములలో ఈయన నాగార్జున సాగర్, దిగువ భవానీ, మాలంపూయ, కోసి, హీరాకుడ్, చంబల్, ఫరక్కా, శ్రీశైలం మరియు తుంగభద్ర ప్రాజెక్టు లకు రూపకల్పన చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారాజ్ డిజైనర్ ఈయనే ఈయన స్మృత్యర్ధము పులిచింతల ప్రాజెక్టు కు కె.ఎల్.రావు ప్రాజెక్టు అని నామకరణము చేయబడినది. ఇంజనీరుగా చేసిన విశిష్టసేవలకు గుర్తింపుగా మూడు పర్యాయాలు రాష్ట్రపతి పురస్కారం లభించింది. వీరి స్వీయ చరిత్ర ఇంగ్లీషులో ఉంది. దాని పేరు ‘క్యూసెక్స్ కేండిడేట్’. ఇది నీటిపారుదలకు సంబంధించిన సాంకేతిక గణాంక వివరణ పదం. ఈయన ప్రసంగాలలో ఆ పదం (క్యూసెక్స్) తప్ప ఇంకో పదం ఇన్నిమాట్లు పునరుక్తం కాదు. అందువల్ల ఆయన స్వీయ చరిత్రకు చలోక్తిగా ఈ పేరు పెట్టారు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com