Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 తనికెళ్ల భరణి
ఈ రోజు ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, తనికెళ్ల భరణి పుట్టిన రోజు. విలన్ పాత్రలైనా, కామెడీ పాత్రలైనా, క్యారెక్టర్ నటుడిగానైనా తన మార్క్ చూపించకుండా వదిలిపెట్ట భరణి. ‘లేడీస్ టైలర్’తో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన 750 పైచిలుకు చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు. ‘శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’ చిత్రంలో దొరబాబుగా, ‘శివ’ చిత్రంలో నానాజీగా నటించిన తరువాత తనికెళ్ల భరణికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత అవకాశాలు వరుసకట్టాయి. మరో పక్క రచనలోనూ తన ప్రావీణ్యం ప్రదర్శించారు భరణి. ‘కంచు కవచం’తో రచయితగా పరిచయమైన ఆయన ఆ తరువాత ‘శివ’, ‘లేడీస్ టైలర్’, ‘చెట్టుకింద ప్లీడర్’, ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’, ‘స్వరకల్పన’ తదితర విజయవంతమైన చిత్రాలకి మాటలు సమకూర్చారు. ‘మిథునం’తో దర్శకుడిగా కూడా విజయాన్ని అందుకొన్నారు భరణి. ‘సముద్రం’లో నటనకిగానూ ఉత్తమ విలన్ గా, ‘నువ్వు నేను’లో నటనకి ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా, ‘మిథునం’కిగానూ ఉత్తమ మాటల రచయితగా, ‘గ్రహణం’ చిత్రంలో నటనకి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాల్ని అందుకొన్నారు. శివభక్తుడైన భరణి శివుడి లీలలపై ‘ఆటకదరా శివ’, ‘శభాష్ శంకర’ అనే పుస్తకాల్ని రచించారు. మేనరిజమ్‌లోనూ, సంభాషణలు పకలడంలోనూ ప్రత్యేకతని ప్రదర్శించే భరణి తెలుగు తెరపై గుర్తుండిపోయే ఎన్నో పాత్రల్ని పోషించి మెప్పించారు.

2 విలియం హన్నా
ఈ రోజు చిన్నప్పటి నుంచి మనల్ని అలరిస్తున్న వస్తూన్న టామ్ అండ్ జెర్రీ, స్కూబీడూ, స్మర్ఫ్స్, యోగి బేర్… పాత్రల సృష్ట కర్త పుట్టిన రోజు. ఆ క్యారక్టర్స్ గురించి తెలియని వారు ప్రపంచవ్యాప్తంగా ఉండరనడంతో అతిశయోక్తి లేదు. ఇలాంటి పాత్రలకు తన కుంచెతో ప్రాణం పోసిన చిత్రకారుడు విలియం హన్నా. యానిమేటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా, వాయిస్ యాక్టర్‌గా, కార్టూన్ ఆర్టిస్ట్‌గా, సంగీత కారుడిగా తనదైన ముద్ర వేసిన సృజనశీలి. తన స్నేహితుడు జోసెఫ్ బర్బెరాతో కలిసి ‘హన్నా బార్బెరా’ స్టూడియోను నెలకొల్పి అద్భుతమైన పాత్రలతో కార్టూన్ స్ట్రిప్స్ నుంచి పుస్తకాలు, బొమ్మలు, టీవీ సీరియల్స్, వెండితెర సినిమాలతో వినోద ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. వీళ్లు సృష్టించిన పాత్రలు అమెరికా సంస్కృతిలో ఓ భాగమైపోవడం విశేషం. వీరి పాత్రలను అప్పటి రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల మంది చూశారనేది ఓ అంచనా. ఈ పాత్రల కథలు దాదాపు 28 భాషల్లోకి తర్జుమా అయ్యాయి. సంగీతంపై అప్పట్లో పెంచుకున్న మక్కువ భవిష్యత్తులో అతడి సినిమాలకు ఎంతగానో ఉపయోగపడింది. బొమ్మలు గీయడంలో ప్రావీణ్యం సాధించాడు. అదే అతడిని యానిమేటర్‌గా మార్చింది. వాటితోనే ఎంటర్టైన్నెంట్ రంగంలో తన పాత్రలతో చెరగని ముద్ర వేసారాయన.

3 శరత్ కుమార్
తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి గ్యాంగ్ లీడర్ అనే చిత్రంలో చిరంజీవి అన్నయ్య పాత్రలో నటించాడు.చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే ఆయన నటించిన మండే సూర్యుడు సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధించింది. అలాగే మగాడు, బాలచంద్రుడు, సూర్య ఐపీఎస్, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, అగ్రిమెంట్,కెప్టెన్, రాజస్దాన్, బన్నీ, జెండాపై కపిరాజు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, భరత్ అనే నేను, సాక్ష్యం వంటి సినిమాల్లో నటించారు. ఇంకా నటిస్తూ ఉన్నారు. ఈయన ప్రముఖ నటి రాధిక భర్త. వీరి కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా బిజీ నటి. రాజకీయాల్లోకి సైతం వెళ్లిన శరత్ కుమార్ తమిళనాట ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.

4 శివ్‌నాడార్
హెచ్‌సీఎల్ వ్యవస్ధాపకుడు శివ్‌నాడార్ కూడా ఈ రోజే జన్మించారు. ఆయన గురించి సామాన్యలకు తెలియకపోవచ్చు ఏమో కానీ …పారిశ్రామిక వర్గాలకు ఆయన సుపరిచితుడు. తన ఆలోచనలతో, విధానాలతో అందరినీ తన వైపుకు తిప్పుకుంటూంటారు. కేవలం రూ.1.87 లక్షల పెట్టుబడితో 1976లో హెచ్‌సీఎల్ కంపెనీని ప్రారంభించారు. రూ 89,250 కోట్ల సంపదతో ఇప్పుడు భారత బిలియనీర్ల జాబితాలో మూడవ స్ధానం దక్కించుకున్నారు. సన్నిహితులు ఆయనను ముద్దుగా ‘మాగస్’ అని పిలుస్తారు. పర్షియన్ భాషలో ‘మాగస్’ అంటే మాంత్రికుడు అనే అర్థం ఉంది. ఐటీ రంగంలో ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేసిన మాంత్రికుడే. సొంత కంపెనీని సాంకేతిక పురోగతితో లాభాల బాట పట్టించిన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల కోసం నిధులు విరాళంగా ఇవ్వడం కోసం కంపెనీలో తన వాటాలు, తన కుటుంబ సభ్యుల వాటాలలో సింహభాగాన్ని తెగనమ్ముకున్న వదాన్యుడు కూడా. నాలుగు దశాబ్దాల కిందటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొలి కంప్యూటర్‌ను అందించిన ఘనత శివ నాడార్ స్థాపించిన హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) కంపెనీకే దక్కుతుంది.హెచ్‌సీఎల్ కంపెనీ ఛైర్మన్ శివనాడర్ దైవభక్తుడు…తిరుమల తిరుపతి దేవస్థానానికి కోట్ల రూపాయాలు విరాళంగా ఇస్తూంటారు. బర్డ్ ట్రస్ట్కు విరాళం అందిస్తూంటారు. ఐటీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా నాడార్కు 2008లో పద్మభూషణ్ అవార్డు వరించింది. విద్యారంగంలోనూ నాడార్ విరాళాలు ఇస్తూ ఎంతో కృషి చేస్తున్నారు.

5 రోషన్..

రోషన్ లాల్ నాగర్ నాధ్ ఒకప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు. బాలీవుడ్ ని ఏలిన వాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కు స్వయానా తాతగారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు . ఆయన కుమారులే రాకేష్ రోషన్,రాజేష్ రోషన్. రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్. మొదట్లో ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. Neki Aur Badi చిత్రంతో ఆయన మ్యూజిక్ డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత రాజ్ కపూర్ నటించిన ‘Bawre Nain’ కు పనిచేసాడు. ఆ సినిమా తర్వాత వెనతిరిగిచూసుకోలేదు. కెరీర్ లో ఎన్నో చెప్పుకోదగ్గ మెలోడీలు ఇచ్చారు. ఆయన వేసిన పునాదుల మీదే ఈ రోజు హృతిక్ తన ప్రయాణం సాగుతోందని గర్వంగా చెప్తూంటారు.

6 ఇంగ్మార్ బెర్గ్మాన్

ప్రముఖ స్వీడిష్ దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమాలు ప్రపంచ సినిమా రంగంలో ఎందరికో ప్రేరణను కలిగించాయి..ఎందరినో ప్రభావితం చేశాయి. అయితే, బెర్గ్మాన్ ఒక దర్శకుడే కాదు.. రచయిత కూడా. తన సినిమాలు, వాటి తాలూకా స్క్రీన్ ప్లేలు కాకుండా అనేక నాటకాలు కూడా వ్రాశాడు. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఇప్పటికీ ఆయన పుట్టిన రోజుని మర్చిపోకుండా చేస్తూంటారు. దర్శకుడు చేయవలసిన పని ఏమిటంటే జీవితాన్ని పునర్నిర్మించాలి. జీవితం కదలికలు, వైరుధ్యాలు, సంక్షోభాలు, ప్రతి చిన్న అంశాన్నీ పునర్నిర్మించాలి అని ఆయన సినిమాలు అబ్జర్వ్ చేసిన వారు చెప్తారు. తాను దర్శించిన సత్యంతోటి సూక్ష్మ పరిణామాన్నీ, పరిమాణాన్ని కూడా ఆయన సినిమాలు బహిరంగ పరుస్తాయి. సినిమాకు ఒక కొత్త తాత్వికతను నేర్పిన సినీ మేధావి.దాదాపు 60 సినిమాలు, టెలివిజన్ డాక్యుమెంటరీలకి దర్శకత్వం వహించాడు . అతని పాపులర్ సినిమాలు. The Seventh Seal (1957), Wild Strawberries (1957), Persona (1966), Cries and Whispers (1972), and Fanny and Alexander (1982). ప్రపంచంలోని మేటి దర్శకులెందరో తమకు స్ఫూర్తిగా పేర్కొనే మహాదర్శకుడు ఇన్మార్ బెర్గ్‌మన్! ‘మూవీ కెమెరా కనుక్కున్నాక, భూమ్మీద జన్మించిన అతిగొప్ప సినిమా కళాకారుడు బెర్గ్‌మన్,’ అంటాడు దర్శకుడు వూడీ అలెన్. మృత్యువు, అస్తిత్వం, నైతిక చింతన, దైవం, నిరాశ, ఒంటరితనం, కలలు, గతించిన యౌవనం, పశ్చాత్తాపం, వాంఛ లాంటి బలమైన భావనల్ని అజరామరంగా తెరకెక్కించాడు బెర్గ్‌మన్.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com