Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

  1. కన్నడ హీరో శివరాజ్ కుమార్

ఈ రోజు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పుట్టిన రోజు. మనకి తెలుగులో ఎలా అయితే నందమూరి, అక్కినేని కుటుంబాలు ఉన్నాయో అలానే కన్నడలోనూ రాజ్ కుమార్ ఫ్యామిలీ ఎప్పటి నుండో సినిమా రంగంలో ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోగా రాజ్ కుమార్ చక్రం తిప్పగా ఆయన తరువాత ఆయన ముగ్గురు కొడుకులు కూడా కన్నడ సినిమాల్లో తమ సత్తా చాటారు. పెద్దోడు శివ రాజ్ కుమార్ హీరోగా అక్కడ చక్రం తిప్పాడు. శివ రాజ్ కుమార్ ఆర్జీవి తీసిన “కిల్లింగ్ వీరప్పన్” మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమా అప్పట్లో బానే ఆడింది. ఆ తరువాత బాలయ్యతో ఉన్న స్నేహంతో సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీలో ఒక పాటలో అతిథి పాత్రలో గొంతు కలిపి తెలుగు ప్రేక్షకులను అలరించారు. 1974 సంవత్సరంలో “శ్రీనివాస కల్యాణ” మూవీ తో శివరాజ్ కుమార్ బాల నటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి 1986 సంవత్సరంలో “ఆనంద్ ” మూవీ తో హీరోగా మారారు. సుమారు 140 మూవీస్ లో నటించి కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు శివరాజ్ కుమార్.

2 sanjay-manjrekar

భారత క్రికెట్ కామెంటేటర్లలో ఎక్కువగా వార్తల్లో నిలిచే సంజయ్ మంజ్రేకర్ పుట్టిన రోజు ఈ రోజు. తన వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటాడు మంజ్రేకర్. 1987 నుంచి 1996 వరకు భారతదేశం తరపున మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గా సేవలందించాడు. టెస్టుల్లో 37.14 సగటుతో 2000 పైగా పరుగులు చేశాడు. కొన్నిసార్లు వికెట్ కీపర్ గా కూడా ఆడాడు. అతని బ్యాటింగ్ సాంకేతిక మెలకువలు కచ్చితంగా ఉంటాయని ప్రతీతి. ఆడటం విరమించిన తరువాత క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. అయితే ఈ క్రమంలో గత ఏడాది రవీంద్ర జడేజాను బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అనే వ్యాఖ్యలు దగ్గర్నుంచీ, కొన్ని రోజుల క్రితం సహచర కామెంటేటర్ హర్షాభోగ్లేను విమర్శస్తూ చేసిన వ్యాఖ్యల వరకూ వివాదాస్పదం అవుతూనే వచ్చాయి. కాగా, మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా తొలి వన్డేకు బీసీసీఐ కామెంటరీ ప్యానల్‌లో మంజ్రేకర్‌కు చోటు దక్కలేదు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా మంజ్రేకర్ వ్యాఖ్యానం అవసరం లేదంటూ చురకలంటించింది. కానీ ఆయనకు ఓ వర్గంలో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. మీడియాలో ఆయన వ్యాఖ్యలకు విపరీతమైన ప్రాచుర్యం లభిస్తూంటుంది. మంజ్రేకర్ మాట్లాడుతూ.. కామెంటరీ చెప్పేటప్పుడు ఆటగాళ్లను గాయపరచకుండా వ్యాఖ్యానించడం దాదాపు కుదరని పని అన్నాడు. ఈ విషయంలో తమను అలంకార ప్రాయంగానే చూడాలని, అదే సమయంలో తమ కామెంటరీకి పెద్దగా ప్రాముఖ్యతనివ్వకుండా క్రికెటర్లు తమ పని తాము చేసుకుంటే ఇబ్బందేమీ ఉండదన్నాడు.

3 Vandana Luthra

నేడు యువతరానికి ఆరోగ్య స్పృహతో పాటు సౌందర్య స్పృహ కూడా ఎక్కువనే విషయాన్ని మూడు దశాబ్దాల క్రితమే గ్రహించి దాన్ని బిజినెస్ గా మార్చిన ఓ గృహిణి వందనా లూత్రా ! ఒక చిన్న అవుట్‌లెట్‌తో ప్రారంభించి.. పదమూడు వందల కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి అయిన ఆమె.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్…అని చెప్తూంటుంది. ఆరోగ్యం,అందం ఆ రెండింటినీ ఒకే గొడుగు కింద అందించే ఉద్దేశ్యంతో వీఎల్‌సీసీ బ్యూటీ అండ్ వెల్‌నెస్ కంపెనీని ప్రారంభించారు. ఒకప్పుడు గృహిణిగా ఇంటికే పరిమితమైన ఆమె ఇద్దరు కూతుళ్ల ఆలనాపాలనా చూసుకుంటూనే 1989లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, నేడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆసియా, ఆఫ్రికా, గల్ఫ్ సహకార సమాఖ్యలలోని సుమారు 16 దేశాల్లో రెండొందల నగరాలకు విస్తరించింది వీఎల్‌సీసీ.

పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు రెండేళ్ల ముందునాటి మాట. మధ్యతరగతి మహిళలు వ్యాపారాల్లోకి వచ్చేవాళ్లు కాదు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ఆదరణ ఉండేవి కాదు. వందన రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేది. ‘బ్యూటీపార్లర్‌కు లోనా? వెళ్లవమ్మా వెళ్లు..’ అంటూ మేనేజర్లు కసురుకునేవాళ్లు. ‘ఇది బ్యూటీ పార్లరే కాదు.. వెల్‌నెస్, ఫిట్‌నెస్ సెంటర్’ అని చెప్పినా.. అర్థమయ్యే రోజులు కావవి. బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగీ తిరిగీ.. ఆఖరికి రుణం అయితే సంపాదించింది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓ పార్లర్‌ను కొని.. వెల్‌నెస్ సెంటర్‌గా మార్చేసింది. దానికి వందన పెట్టిన పేరు ‘వి..ఎల్..సి..సి’ . దిల్లీ నగరం మార్మోగేలా ప్రకటనలు ఇచ్చింది. అక్కడి ప్రజలకు అదో కొత్త వింత. దిల్లీలో తొలిసారి వెల్‌నెస్ సెంటర్ మొదలయ్యేసరికి.. వి.ఎల్.సి.సి వద్ద జనం బారులు తీరారు. మూడునెలలు తిరక్కుండానే.. పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చింది. ఇక, రాజధానికే పరిమితమైతే ఎలా? దేశమంతా విస్తరించాలి? దీన్నొక బ్రాండ్‌గా తయారుచేయాలి? ఇదే వందన పట్టుదల. ఏడాదిలోపే అనుకున్నది సాధించింది.

కేంద్రప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి 2013లో ఆమెను పద్మశ్రీ తో సత్కరించింది. అలాగే 2015 ఫార్చూన్ ఇండియా ప్రచురించిన శక్తివంతమైన భారతీయ మహిళా వ్యాపారవేత్తల్లో 33వ స్థానం దక్కించుకున్నారు. ఇవే కాక ఇంకా అనేక ఆవార్డులు, రివార్డులు వందనలూత్రా ఖాతాలో చేరాయి. అలాగే వెల్‌నెస్, ఫిట్‌నెస్‌లు ప్రధానాంశంగా కంప్లీట్ ఫిట్‌నెస్ ప్రోగ్రాం, ఎ గుడ్ లైఫ్ పేరుతో రెండు బుక్స్ కూడా ఆమె వెలువరించారు. ఇప్పటికీ విజయ వంతంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ పదమూడు వందల కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి అయిన వందనా లూత్రా కరల్స్ అండ్ కర్వస్ వ్యవస్థాపకురాలు వందనలూత్రా ఎందరికో ఆదర్శనీయం.

4 ఉప్పలపాటి నారాయణరావు

టెక్నికల్ గా బ్రిలియంట్ సినిమా తీసినా సరే.. సరైన సక్సెస్ ని అందిపుచ్చుకోవటంలో తేడా కొట్టి మరో ఛాన్స్ దొరకని దర్శకులు చాలా మంది తెలుగులో ఉన్నారు. అలాంటి వారిలో మొదటివరసలో మొదటివాడు ఉప్పలపాటి నారాయణరావు. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. అక్కినేని నాగార్జున తీసిన “జైత్రయాత్ర” చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఉప్పలపాటి నారాయణరావు… తర్వాత నాగార్జున నటించిన “రక్షణ” చిత్రం ద్వారా తొలి హిట్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన తీసిన తీర్పు, పాతబస్తీ, మైనా, వీడు సామాన్యుడు కాదు, యువరత్న లాంటి చిత్రాలు ఆయనకు మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందివ్వలేదు. సినిమా డైరెక్టర్‌నే తాను తీసే సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక సినిమాను తీయడం అనేది ఒక పెద్ద ప్రహసనం అయితే.. అది హిట్ అవ్వడం అనేది మరో పెద్ద సమస్య గా మారింది. అయితే అది ఆయన ప్రతిభకు కొలమానం కాదు. ఆయన హిట్ తీయలేదని వెనకబడినట్లు కాదు. ఆయన్ను అందిపుచ్చుకునేందుకు ఇండస్ట్రీ ధైర్యం చేయటం లేదని చెప్పాలి.

5 Director Bimal Roy

‘సైలెంట్ మాస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని గౌరవంగా పిలుచుకునే ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు బిమల్ రాయ్ . శరత్ నవలలు ‘దేవదాస్’, ‘పరిణీత’లను చలనచిత్రాలుగా నిర్మించి కీర్తి గడించిన అరుదైన దిగ్దర్శకులు బిమల్ రాయ్. 50 దశకంలో బిమల్ రాయ్ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉన్నాడంటే అది ఒక వింతే. ఉత్తర భారతదేశంలో పెద్ద పెద్ద టౌన్స్ నుంచి, చిన్నచిన్న గ్రామాల్లో కూడా బిమల్ రాయ్ నిర్మించిన సినిమాలు నిబద్ధతతో ఆడేవి. బిమల్ రాయ్ అడుగుపెట్టిన రోజులు చలనచిత్ర చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగినవిగా చరిత్రకారులు చెప్తారు. సాంఘిక సమస్యలనే తన కథావస్తువులుగా తీసుకొని సినిమాలుగా మలిచిన మేధావి బిమల్ రాయ్. భారతీయ సినిమాకు సామాజిక నడక నేర్పి, సంగీత సౌరభాలు నింపి, సృజనాత్మకత అద్దిన చిత్రశిల్పి..బిమల్ రాయ్. ఆయన సినిమాల్లో ఆకలి, శ్రమ, నిజాయితీ, అంటరానితనం, నిరుద్యోగం వంటి అనేక సామాజిక అంశాలు ప్రధాన ఇతివృత్తాలయ్యాయి. సుజాత, నౌకరీ, పరక్, పరిణీత, బిరాజ్ బహు, మధుమిత, బందిని వంటి విశేష ఆదరణ పొందిన సినిమాలే అందుకు తార్కాణాలు. బిమల్ రాయ్ నిర్మించిన దో భీగా జమీన్ దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు పొందింది. సామాన్యుల హృదయాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. 1953లో విడుదలైన ఈ చిత్రం గొప్ప విజయాన్ని నమోదు చేసింది. అనేక భాషల్లో పునర్ నిర్మాణమైంది. బిమల్ రాయ్ 1959లో నిర్మించిన చిత్రం…సుజాత. ఆ కాలపు ప్రగతిశీలమయిన చిత్రమిది. అంటరానితనాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని నిర్మించిన ఈ చిత్రంలో స్త్రీ సమస్యకు తోడు అంటరానితనమూ తోడయినపుడు ఆ స్త్రీ పడే ఆవేదనా, అనుభవించే దుఃఖమూ హృద్యంగా తెరకెక్కించారు బిమల్ రాయ్. సుజాత పాత్రలో నటించిన నూతన్ ప్రశంసలు పొందింది. హిందీలో పెద్ద హిట్టయిన సుజాత తర్వాత అనేక భారతీయ సినిమాల్లో రీమేకయ్యింది. రక్త సంబంధాల్ని ఇతివృత్తాలుగా అనేక సినిమాలు నిర్మాణమవ్వడం మొదలైంది సుజాత విజయం తర్వాతే.

6 Sujitha. tv artist Jul 12, 1983
ఈ టీవి నటిని ఎరగని తెలుగువాళ్లు ఉండరు. కేరళ కుట్టి అయినా తెలుగమ్మాయే అనిపిస్తుంది. తెలుగిళ్లలో ‘మా’టీవీ ద్వారా ‘వదినమ్మ’గా తన స్థానం సుస్థిరం చేసుకున్న సుజిత. తీరైన కట్టూ బొట్టుతో.. నిండైన రూపంతో ఆకట్టుకుంటున్న సుజిత పుట్టిన రోజు ఈ రోజు. బాలనటిగా, నటిగా అన్ని భాషల సినిమాల్లోనూ చేసింది. కానీ, ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. అలా తెలుగువారికి ఆమె బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాల్లో చేసినా ఆమెను ఇంటింటికీ చేరవేసింది మాత్రం ‘కలిసుందాం రా’ సీరియల్. అప్పడు ఆమె తొమ్మిదవ తరగతిలో చేరబోతున్నాను. ఆ సమయంలో బాలాజీ టెలీఫిలిమ్స్ నుంచి ఈ ఆఫర్ వచ్చింది. అంత చిన్న వయసులో కాలేజీ చదివే అమ్మాయిలా, ఆ తర్వాత భార్యగా, ఉమ్మడి కుటుంబంలో కోడలిగా.. లీడ్ రోల్ పోషించింది. వయసుకు మించి మెచ్యూరిటీ చూపించడం ఆ సీరియల్ ఆమెకు నేర్పింది. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, కుటుంబసభ్యులతో ఎలా ఉండాలి… ఇలా ఎన్నో విషయాలను ఆ సీరియల్ నాకు నేర్పించింది అని చెప్తారామె. అలాగే పెళ్లికి ముందు ఒకే టైమ్‌లో 2–3 సీరియల్స్ చేసేరామె. పెళ్లయ్యాక మాత్రం ఒకటే సీరియల్ చేస్తూ అది పూర్తయ్యాకనే మరోటి ఎంచుకుంటోంది. ఆ విధంగా నెలలో 10 రోజులు వర్క్‌కి, మిగతా 20 రోజులు ఫ్యామిలీకి అనుకుని ముందుకు వెళ్తోంది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com