Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 తమిళ డైరక్టర్ బాలా

ఈ రోజు ప్రముఖ తమిళ దర్శకుడు బాలా జన్మించారు. ఆయన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సేతు చిత్రంతో విక్రమ్‌కు, నందా చిత్రంతో సూర్యకు, నాన్ కడవుల్ చిత్రంతో ఆర్యకు లైఫ్ ఇచ్చిన దర్శకుడీయన. దర్శకుడిగా వైవిధ్యానికి మారుపేరుగా పేరొందిన ఆయన.. ఏ సినిమా చేసినా అది సెన్సేషనే. అలాగే నా సినిమాలకు కథ ఉండదు. కథ గురించి పట్టించుకోను. నటీనటుల్ని హైలైట్ చేస్తాను .క్యారెక్టర్‌పైనే దృష్టిపెడతాను. కథలు రాయాలంటే వాటిని నవలలుగా రాసుకోవాలి. సినిమాకు కథ అవసరంలేదు. అందుకే కథ లేకుండానే సినిమాలు తీస్తాను అంటూ సినిమా కథల గురించి బాలా చెప్తూంటారు. నా శివపుత్రుడు సినిమా తీస్తే ఓ కాటికాపరి అది నా కథ అని కేసు పెట్టారు. అందులో కథలేదు. క్యారెక్టర్ ఉందని వివరణ ఇచ్చాను.

‘శివపుత్రుడు’ తీశాక చెన్నైలో ఓ కాటికాపరి ఇది నా కథ అని బాలా పై కేసు పెట్టాడు. అది ఓ క్యారెక్టర్ మాత్రమే అని చెప్పాల్సి వచ్చింది. అంతలా జనం ఆయన సినిమాలకు కనెక్ట్ అవుతూంటారు. హీరో అంటే ఒక లాండ్ మార్క్ అనేది చాలా చిత్రాల్లో ఉంది. ఆస్ట్రేలియాలో ఒక సాంగ్, ఆ తర్వాత మలేషియాలో భోజనం. న్యూజిలాండ్‌లో ఫైట్లు.. ఇలాంటివి నాకు తెలీవు. రియల్ లైఫ్‌లో మనిషి ఎలా ఉంటాడో నా సినిమాలో హీరో అలా ఉంటాడు అని ఆయన అంటారు. ఇక బాలా గురించి ఆయనతో పనిచేసిన వారు చెప్పే మాట ఒకటే..బాలా యూనిక్, ఆయన ప్యారలల్ సినిమాని, కమర్షియల్ తో బ్లెండ్ చేసారు. ఇంతకు ముందు అలా చాలా మంది చేసారు కానీ బాలాలాగ సక్సెస్ కాలేదు అంటారు. తమిళంలో సుబ్రమణ్యపురం, పరుత్తి వీరన్ వంటి సినిమాలు వచ్చాయంటే అది బాలా పుణ్యమే అంటారు.

  1. మణిశర్మ

‘ప్రేమించుకుందాం..రా!, చూడాలని ఉంది, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, ఖుషి, ఇంద్ర, ఠాగూర్, పోకిరి’, ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమాలన్నీ కూడా వరుస ప్రకారం ఒక దాని రికార్డులను మరొకటి బద్దలు కొట్టినవే. అయితే వీటిన్నంటికి ఉన్న కామన్ పాయింట్ మాత్రం ఒకటే.. అదే మణిశర్మ అందించిన సంగీతం. అంటే.. మణి సంగీతమందించే సినిమాలే బ్లాక్ బస్టర్‌కి కేరాఫ్ అడ్రస్‌లుగా నిలుస్తాయన్నంతగా ఓ పీరియడ్ సాగిందన్నమాట. దటీజ్ మణిశర్మ. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. బ్లాక్ బస్టర్ సినిమాలెన్నో మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మురిసిపోయాయి. మాస్ పాటలు కూడా మెలోడీతో జోడీ కట్టాయి. కొన్ని పాత పాటలైతే తన స్వరాలతో కొత్త సొబగులద్దుకుని రీమిక్స్ లుగానూ అలరించాయి. ఆయన బాణీల కోసం టాప్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు క్యూ కట్టేవారు. ఇంత నేప‌థ్యం ఉన్న ఆ సంగీత దర్శకుడే మెలోడీ బ్ర‌హ్మ మణిశర్మ.

పాటలకి పాటలు.. నేపథ్య సంగీతానికి నేపథ్య సంగీతం. ఈ రెండింటికి న్యాయం చేయగల సంగీత దర్శకులు కొంతమందే ఉంటారు. ఈ లిస్ట్‌లో స్వ‌ర‌బ్ర‌హ్మ మణిశర్మ పేరు తప్పక ఉంటుంది. పక్కా మాస్ సాంగ్ లోనూ మెలోడీని జోడించడమన్నది అరుదైన విషయం. అలాంటి క్రెడిట్ నీ సంపాదించుకున్నారు మణిశర్మ. మాస్ సాంగ్ అంటే డ్రమ్ బీట్సే అనుకునేవారికి మెలోడియస్‌గా ఆన్సర్ ఇచ్చారు మణి. అలాగే నా పాటలో ముందు మాట వినిపించాలి. వేటూరిగారు, శాస్త్రిగారు వంటి లిరిసిస్ట్‌లు మనదగ్గర ఉన్నప్పుడు, వాళ్లిచ్చే సాహిత్యం వినిపించకుండా పీకనొక్కేస్తే ఇంక భాష ఏం నిలుస్తుంది? అందుకే మొదటి నుంచీ నేను ఆ విషయంలో నిక్కచ్చిగా ఉన్నాను.‘రామ్మా చిలకమ్మ’ అయినా ఇంకోటయినా పాటలో పదాలు వినిపించాల్సిందే. పాట వింటూ ఆ పదాలను పేపరుపై ఎవరైనా రాయగలగాలి అనుకునేవాడిని అని చెప్తారాయన.

’చూడాలని ఉంది‘, ’ఒక్కడు‘ చిత్రాలకు ’ఉత్తమ సంగీత దర్శకుడు‘ గానూ మణి ’నంది‘ పురస్కరాలు అందుకున్నారు. 2000వ సంవత్సరం అయితే ’నంది‘ స్పెషల్ ఇయర్ గా నిలిచింది మణికి. ‘చిరునవ్వుతో, ఆజాద్, మనోహరం’ చిత్రాలు ఆ ఏడాదికి గానూ ఉత్తమ చిత్రం, ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ తృతీయ చిత్రం అవార్డులను అందుకోవడం విశేషం. ’గణేష్‘, ’మురారి‘, ’ఒక్కడు‘, ’లక్ష్యం‘, ’పరుగు‘, ’బాణం‘ వంటి సినిమాలు బెస్ట్ పిక్చర్ విభాగంలో నందిని అందుకున్నవే.

3 Amitav Ghosh

ఈ రోజు ప్రఖ్యాత ఆంగ్ల సాహిత్యకారుడు అమితావ్ ఘోష్ జన్మించారు. ఆయన కు 2018 సంవత్సరానికి 54వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని న్యూఢిల్లీలో అందుకున్నారు. అమితావ్ …జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న మొట్టమొదటి ఆంగ్ల రచయిత కావటం విశేషం. దేశంలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞాన్ పీఠ్ పురస్కారం కింద అమితావ్ ఘోష్ కు రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవి ప్రతిమ, ప్రశంసా పత్రం ప్రదానం చేశారు. ‘వినూత్న రచనలకు పేరొందిన అమితవ్ చారిత్రక విషయాలతో పాటు ఆధునిక యుగంలోని పరిస్థితుల్ని స్పృశించారు. గతాన్ని వర్తమానంతో అనుసంధానించారు’ అని జ్ఞాన్‌పీఠ్ అకాడమీ కొనియాడింది. ప్రముఖ సమకాలీన భారతీయ రచయితల్లో ఒకరైన అమితవ్‌కు షాడో లైన్స్, ది గ్లాస్ ప్యాలెస్, ది హంగ్రీ టైడ్ నవలలు మంచి పేరు తెచ్చాయి.

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో 1956లో జన్మించిన అమితావ్ ఘోష్ కు మందలో ఒకడిగా కాకుండా ప్రత్యేకతను చాటుకొనే రచయితగా సాహితీ లోకంలో గుర్తింపు ఉంది. చరిత్రలోని విషయాలను అత్యంత నిపుణతతో వర్తమానానికి జోడించడం ఆయనకే సాధ్యమైన శైలి. బ్రిటిష్ పాలనలో భారత్, చైనాల మధ్య జరిగిన నల్లమందు వ్యాపార కాలక్రమాన్ని వివరిస్తూ సీ ఆఫ్ పాపీస్, రివర్ ఆఫ్ స్మోక్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్ పేరిట వరుసగా మూడు నవలలు రాశారు. ఆయన ప్రముఖ రచనల్లో ‘ద సర్కిల్ ఆఫ్ రీజన్’, ‘ది షాడో లైన్’, ‘ద కలకత్తా క్రోమోజోమ్’, ‘ద గ్లాస్ ప్యాలెస్’, ‘ద హంగ్రీ టైడ్’, ‘రివర్ ఆఫ్ స్మోక్’, ‘ఫ్లడ్ ఆఫ్ ఫైర్’ ప్రముఖమైనవి. ఆయన చివరగా రాసిన పుస్తకం ‘ ది గ్రేట్ డిరేంజ్‌మెంట్: క్లైమేట్ చేంజ్ అండ్ అన్‌తింకబుల్’ 2016లో విడుదలైంది. గతంలో అమితవ్‌కు పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.

4 సురేష్ ప్రభు మాజీ రైల్వై మినిస్టర్

వాళ్లంతా డెహ్రాడూన్ లోని ఏసీఎన్ స్కూలులో విద్యను అభ్యసిస్తున్నారు. శీతాకాల సెలవులు ఇచ్చేసరికి తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు హరిద్వార్ నుంచి హౌరా వెళ్లే కుంభ్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. పొగ మంచు కారణంగా రైలు చాలా ఆలస్యంగా నడుస్తోంది. ఆ రైల్లో ప్యాంట్రీ కార్ లేదు. వారణాసి సమీపంలోకి వచ్చేసరికి పిల్లలంతా ఆకలితో ఉన్నారు. ఇంకా ఎంతసేపటికి గమ్యం చేరుతామో తెలియని పరిస్థితిలో, ట్విట్టర్ ద్వారా తమ ఆకలి గురించి రైల్వే మంత్రి కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ట్వీట్ ను చూసిన సురేష్ ప్రభు, వెంటనే అధికారులకు వారి ఆకలి తీర్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు ట్వీట్ చేసిన నిమిషాల్లో, వారికి ఆహారం, మంచినీరు, కాఫీ తదితరాలు వారి సీట్ల వద్దకు వచ్చేశాయి. “ఇండియా మారుతోంది అనడానికి ఇదే నిదర్శనం. ప్రతి ఫిర్యాదుపై అధికారులు, మంత్రులు ఇలాగే స్పందిస్తే ప్రజలంతా ఎంతో ఆనందిస్తారు” అని అందరూ ప్రశంసించారు . ఆ రైల్వై మంత్రే సురేష్ ప్రభు. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. వృత్తిరీత్యా చార్టెడ్ ఎక్కౌంటెంట్ అయిన సురేష్ ప్రభు..రాజకీయాలను,మానవత్వంతో మెలగటాన్ని కలిపి చూడటానికి ఇష్టపడరు. అందుకే ఆయనంటే చాలా మందికి ఇష్టం.

5
ఈ రోజు ప్రముఖ భారత-అమెరికన్ రచయిత్రి జంపా లహరి పుట్టిన రోజు. ఆమెని అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు ‘నేషనల్ హూమానిటీస్ మెడల్ వరించింది. ఆమె రాసిన ‘లోల్యాండ్’ పుస్తకం చదివిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ‘నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్ అండ్ నేషనల్ హుమానిటీస్ మెడల్’కు ఎంపిక చేశి అందించారు. జంపా లహరి అసలు పేరు నీలాంజన సుదేష్ణ లహరి. స్కూల్లో పిలవడానికి ఇబ్బందిగా ఉండటంతో టీచర్ ఆమె ముద్దుపేరు ‘జంపా’తోనే పిలవడం మొదలుపెట్టారు. అదే అసలు పేరుగా స్థిరపడిపోయింది. జంపా తల్లిదండ్రులు బెంగాలీలు. లహరి లండన్‌లో పుట్టింది.

తరువాత తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లిపోయారు. తండ్రి అమర్ లహరి కింగ్స్‌టన్‌లోని రోడ్ ఐస్‌ల్యాండ్ యూనివర్సిటీలో లైబ్రరియన్‌గా పనిచేసేవాడు. బెంగాలీ సంస్కృతి పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో తరచూ అప్పటి కలకత్తాకు వచ్చివెళ్లేవారు. అందుకే ఆమె రచనల్లో భారత, అమెరికాల సంస్కృతుల మధ్య వైవిధ్యం స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ఎంఏ, క్రియేటివ్ రైటింగ్‌లో ఎంఎఫ్ఏ, కంపారటివ్ సాహిత్యంలో ఎంఏ, రినైజాన్స్ స్టడీస్‌లో పీహెచ్‌డీ.. ఇలా ఆమె అధ్యయనం అంతా సాహిత్యం చుట్టే తిరిగింది.

దీంతో ఆమెకు రచన ఒంటబట్టింది. మొదట ఆమె కథలు చాలా తిరస్కరణకు గురయ్యాయి. చివరకు 1999లో ‘ఇంటర్‌ప్రిటర్ ఆఫ్ మాలాడీస్’ కథల సంపుటి అచ్చయ్యింది. అమెరికాలో విమర్శకుల ప్రశంసలు పొందినా… ఇండియాలో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఆరు లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఈ పుస్తకం పులిట్జర్ ప్రైజ్‌ను దక్కించుకుంది. 2003లో ఆమె మొదటి నవల ‘ద నేమ్‌సేక్’ పబ్లిష్ అయ్యింది. ఈ నవలను ‘2007’లో అదే పేరుతో సినిమా తీశారు. 2013లో వచ్చిన ఆమె మరో నవల ‘ద లోల్యాండ్’ మ్యాన్‌బుకర్ ప్రైజ్ నామినేషన్స్‌కి ఎంపికైంది.

6 Tun Tun actress-comedian

ఈ రోజు బాలీవుడ్‌లో ప్లే బ్యాక్ సింగర్‌గా, కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్న టున్ టున్ పుట్టిన రోజు. ఆమె అసలు పేరు ఉమాదేవి కాత్రీ. టున్ టున్ అంటే అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. కాని దానిని పెట్టింది మాత్రం దిలీప్ కుమార్. టున్ టున్ దిలీప్ కుమార్‌కు మంచి ఫ్రెండ్. స్టార్ మ్యూజిక్ డెరైక్టర్ నౌషాద్‌కు క్లోజ్ ఫ్రెండ్. పదమూడేళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి నౌషాద్ ఇంటి తలుపు తడితే గాయనిగా ఆయనే అవకాశం ఇచ్చాడు. అవును. టున్ టున్ తన అసలు పేరు ఉమా దేవి పేరుతో చాలా హిట్ పాటలు పాడింది. వాటిలో అందరికీ తెలిసిన ‘అఫ్‌సానా లిఖ్ రహీ హూ దిలే బేకరార్‌కా’ వంటి హిట్స్ ఉన్నాయి. కాని ఎక్కువ రోజులు సింగర్‌గా కెరీర్ కొనసాగించలేకపోతే దిలీప్ కుమార్ ఆమెను నటిని చేశాడు. లావుగా ఉండే ఆమె ఆకారాన్ని బట్టి కమెడియన్‌గా రాణిస్తావ్ అన్నాడు. చాలా సినిమాల్లో హీరోకు లైన్ వేసే లట్టు అమ్మాయిగా టున్ టున్ కనిపిస్తుంది. ఎనభై ఏళ్లు జీవించి 2003లో మరణించినా తెలుగులో గయ్యాళులకు సూర్యకాంతం అనే పేరు ఎలా పడిందో ఉత్తరాదిన లావుగా ఉన్న ఆడవాళ్లకు టున్ టున్ అనే పేరు మిగిల్చి వెళ్లింది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , ,
Similar Posts

ప్రతిష్ఠాత్మక మెక్‌డొనాల్డ్స్ హ్యాపీ మీల్ TM ఇప్పుడు లభిస్తుంది సరికొత్త ఆరోగ్యకరమైన రుచిలో, ITC యొక్క బీ నాచురల్ మిక్స్‌డ్‌ ఫ్రూట్ (జోడించిన చక్కెర లేదు) మరియు వేడిగా, తాజాగా ఉండే కార్న్ కప్‌తోపాటు

Latest Posts from Vartalu.com