Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1. Nara Rohith

ఈ రోజు నారా రోహిత్ పుట్టిన రోజు. ‘బాణం’ సినిమాతో తెరపైకి దూసుకొచ్చాడు నారా రోహిత్. రోహిత్ నటనకు, సినిమాకీ వచ్చిన  రెస్వాన్స్ బిజెనెస్  పరంగా రాలేదు.  అయినా పోరాటం ఆపలేదు. అక్కడికి రెండేళ్ళ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘సోలో’ సినిమాతో సోలో హీరోగా నిలబడ్డ రోహిత్ మూడో సినిమా ‘ఒక్కడినే’తో పరాజయాన్నీ రుచి చూశాడు. తర్వాత విడుదలైన ‘ప్రతినిధి’, ‘రౌడీఫెలో’, ‘అసుర’ సినిమాలతో ఫామ్‌లోకొచ్చి హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత రోహిత్ ‘తుంటరి’గా జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘సావిత్రి’, ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలు అంతంత మాత్రమే అనిపించుకున్నాయి. ‘సావిత్రి’ సినిమాతో గాయకుడి గాను మారిన రోహిత్ ‘అప్పట్లో ఒకటుండేవాడు’ తో గాడిలో పడ్డాడు .  ఆ తర్వాత చేసిన  ‘జ్యో అచ్యుతానందా’ ‘ప్రతినిధి’ ‘రౌడీ ఫెలో’ ‘అసుర’ ‘శమంతకమణి’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘కథలో రాజకుమారి’, ‘సారొచ్చారు’, ‘నాయకి’ సినిమాలు చేసారు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించకుండా హీరో అయ్యారు నారా రోహిత్.  వైవిధ్యమైన కథల్లో మాత్రమే నటిస్తూ మెప్పిస్తున్న నారా రోహిత్ కొంత కాలంగా సినిమాలేవీ చేయకుండా సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు.

2. కైకాల సత్య నారాయణ

సీనియర్ ,లెజండ్రీ నటుడు “నవరస నటనా సార్వభౌమ” కైకాల సత్యనారాయణ ఈ రోజు  పుట్టిన రోజు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో జన్మించిన ఆయన  1959లో సిపాయి కూతురు అనే సినిమాతో పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన కెరీర్ లో ఎప్పుడూ వెనుతిరిగి చూసుకోలేదు. జానపద బ్రహ్మ విఠలాచార్య సత్యనారాయణ చేత విలన్ గా కనకదుర్గ పూజా మహిమలో వేయించాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో అదే కంటిన్యూ అయ్యింది. ఆయన యమగోల మరియు యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా నటించేవాడు. నటుడుగానే కాకుండా..రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థలో కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు. మొత్తం ఆయన ఇప్పటిదాకా 777 సినిమాలు పైగా నటించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన “నవరస నటనా సార్వభౌమ” అనే బిరుదు పొందాడు.
1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి టీడీపీ నుండి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు

3.రాహుల్‌ మహాజన్‌

 ఈ రోజు ప్రముఖ వివాదాస్పద వ్యక్తి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ రాహుల్‌ మహాజన్‌ పుట్టిన రోజు. ఆయన మాజీ కేంద్ర మంత్రి ప్ర‌మోద్ మ‌హాజ‌న్ కుమారుడు. వివాదాలతో సావాసం చేసిన మహాజన్‌ పెళ్లి వార్తలతో ఎప్పుడూ న్యూస్ లో ఉంటూ వచ్చారు. ఆయన మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు. ఆయన మొదటి భార్య శ్వేతా సింగ్‌… చిన్ననాటి స్నేహితురాలు. 13 ఏళ్లుగా పరస్పర పరిచయం ఉన్నప్పటికీ వారి వైవాహిక జీవితం విచ్ఛిన్నమైంది. శారీరకంగా హింసిస్తున్నాడన్న కారణంతో 2007, డిసెంబర్‌లో అతడి నుంచి విడిపోయారు. 2008లో వీరికి విడాకులు మంజురయ్యాయి. అదే ఏడాది హిందీ బిగ్‌బాస్‌ 8లో ఆయన పోటీ పడ్డారు. గ్రాండ్‌ ఫైనల్‌ చేరువైన సమయంలో బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆయనను షో నుంచి తప్పించారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా పాయల్‌ రొహతగి, మోనికా బేడితో ప్రేమాయాణం నడిపినట్టు ప్రచారం జరిగింది.

2010లో నేషనల్‌ టీవీలో ప్రసారమైన ‘రాహుల్‌ దుల్హనియా లే జాయేగా’ రియాలిటీ షోలో డింపీ గంగూలీని రాహుల్ రెండో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత 2014, ఫిబ్రవరి 25న వీరు విడాకులు తీసుకున్నారు. తనను దారుణంగా కొట్టేవాడని డింపీ అప్పట్లో ఆరోపించారు. రాహుల్‌ నుంచి విడిపోయిన తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకున్నారు. భర్త, కూతురుతో కలిసి ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. రాహుల్‌ మహాజన్‌ మూడోసారి పెళ్లి చేసుకున్నారు. కజక్‌స్తాన్‌ మోడల్‌ నటాల్య ఇలినాను పెళ్లాడారు

4  సోమనాథ్ ఛటర్జీ
ఉత్తమ రాజకీయాలకు పెట్టింది పేరు అయిన సోమనాధ్ చటర్జీ జయంతి ఈరోజు. ఇవాళే ఆయన జన్మించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ చాలా పేరు తెచ్చుకున్నారు. 1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో జన్మించారు సోమ్‌నాథ్‌ చటర్జీ. 1968లో సీపీఎం కార్యకర్తగా ప్రజాజీవితంలో మమేకమైన ఛటర్జీ అనతికాలంలోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.  ఆయన 1968లో సిపిఎం పార్టీలో చేరారు. కానీ 2008లో పార్టీ నుంచి అవమానకర పరిస్థితులలో తొలగించబడ్డారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సిపిఎం మద్దతు ఉపసహరించుకొన్నప్పుడు ఆయనను తన పదవికి రాజీనామా చేయవలసిందిగా పార్టీ ఆదేశించగా అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. రాజకీయాలలోకి రాకమునుపు ఆయన కొంతకాలం కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా సోమనాథ్ ఛటర్జీ చేసిన సేవలు ప్రశంసనీయమని దేశమంతా ఆయన చనిపోయినప్పుడు కొనియాడారు.

5. దర్శకుడు మహేంద్రన్

దిగ్గజ దర్శకుడు జే మహేంద్రన్‌ జయంతి ఈ రోజు.  రజనీకాంత్‌ను సూపర్‌ స్టార్‌గా మలవడంతో దర్శకుడు జే మహేంద్రన్‌ది గొప్ప పాత్ర. రజనీ నటించిన ‘ముల్లమ్‌ మలరమ్‌’ చిత్రంతో దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. మెగాఫోన్‌ పట్టకముందు ఆయన పలు సినిమా కథలు రాశారు, స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా నిర్వర్తించారు.  1980లో ఆయన రూపొందించిన ‘నేంజథారు కిలాథే’ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫి, బెస్ట్‌ ఆడియోగ్రఫి అవార్డులు ఆ చిత్రం అందుకొన్నది. నటుడిగా, దర్శకుడిగా మహేంద్రన్‌ గత మూడు దశాబ్దాల సినీ జీవితంలో ‘కాళీ, జానీ, పనక్కర పిళ్లై, తంగ పాతక్కమ్‌, ఉత్తిరిపూక్కల్‌’ లాంటి అత్యంత ప్రజాదరణ చిత్రాలను రూపొందించారు. నటుడిగా ‘కామరాజ్‌, తెరీ, కాటమరాయుడు, నిమిర్‌, మిస్టర్‌ చంద్రమౌథి, సీతాకత్తి, పేట్టా’ చిత్రంలో నటించారు. ఆయన చివరి చిత్రం ‘బూమరాంగ్‌’.

6 Jim Corbett
పులిని గురించి ఎవరైనా మాట్లాడితే మనకు వెంటనే గుర్తు వచ్చే పేరు జిమ్ కార్బెట్. ఆయన జయంతి ఈ రోజు. ఈ రోజే ఆయన జన్మించారు. జిమ్‌ కార్బెట్‌ భారతదేశంలో పుట్టి పెరిగిన ఇంగ్లీషు సైనికాధికారి, వేటగాడు. ఆయన ఉత్తర భారత అడవుల్లో నరమాంస భక్షక పులులనీ, చిరుత పులులనీ వేటాడి చంపి అక్కడి పల్లెటూరి వాళ్ళ ప్రాణాలను కాపాడిన సాహసి. రుద్రప్రయాగ చిరుతపులి కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ తీర్థయాత్రకు వెళ్ళే భక్తులకీ, అక్కడి స్థానికులకీ ప్రాణాంతకంగా మారి ఎనిమిది సంవత్సరాలు వందల మందిని చంపి తినేస్తుంటే, అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వాధికారులే, దాన్నెలాగయినా వేటాడి చంపి జనాల్ని కాపాడమని జిమ్‌ కార్పెట్‌ను బతిమాలారు. జిమ్‌ కార్బెట్‌ నెలల తరబడి అవిశ్రాంతంగా శ్రమించి, అడువుల్లో వందలాది మైళ్ళు తిరిగి 65 రాత్రులు చెట్ల మీద ఒంటరిగా కాపుకాసి, చిట్టచివరకు ఈ చిరుతను చంపేశాడు. అడవి జంతువుల కుండే అద్భుతమైన వినికిడి శక్తి, వాటి అసాధారణమైన కంటి చూపు మనుషులకెప్పుడూ వుండవు అని నిర్ధారించిన జిమ్‌ కార్బెట్‌కు అడవి జంతువుల భాష, వాటి అలవాట్ల గురించి వున్న పరిజ్ఞానం పులివేటలో ఎలా సహకరించాయో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అన్నంత గొప్ప పేరు ఉంది.

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com