Banner
banner

“భారతదేశ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులకు గుర్తింపు- ఆవిష్కరణలు కీలకం“ ఆనే అంశంపై ఒకరోజు సదస్సు నిర్వహించిన ఆర్‌బిఐ, యుఐడిఎఐ

కోవిడ్‌ మహమ్మారి ప్రభావంతో భారతదేశ ఆర్థిక వ్యవస్ధలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. పని విధానం, లావాదేవీలు నిర్వహణ విధానం ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్ కి మారడం, సమస్యలు ఎదురైనప్పటికీ అంతరాయం లేకుండా సేవలను అందించడం వంటి భారీ మార్పులను చూసింది. డిజిటల్ లావాదేవీల నిర్వహణ, డిజిటల్‌ సేవలను అందించేందుకు ప్రజలు, ఖాతాదారులను గుర్తించి, లావాదేవీలను అనుమతించడం లాంటి అంశాలను అమలు చేసేందుకు బిఎఫ్‌ఎస్‌ఐ వంటి మైఖ్యమైన రంగాలు అత్యాధునిక సాంకేతికతను అమలు చేయడం ప్రారంభించి పెను మార్పలకు శ్రీకారం చుట్టాయి. ఆర్థిక సేవలను సులువుగా పొందేందుకు ప్రజలు తమకు అందుబాటులో ఉన్న మార్గాలను గుర్తించే విధానంలో కూడా గణనీయమైన మార్పు కనిపిస్తోంది.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేసి దీనికి శక్తి మరియు సామర్థ్యాలను గుర్తించే లక్ష్యంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) మరియు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ సంయుక్తంగా 24 ఫిబ్రవరి 2022న కర్ణాటకలో బెంగళూరులో “భారతదేశ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులకు గుర్తింపు- ఆవిష్కరణలు కీలకం“ అనే అంశంపై ఒక రోజు సదస్సు నిర్వహించాయి.

ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ శ్రీ టి. రబీ శంకర్, యుఐడిఎఐ సిఇఓ డాక్టర్ సౌరభ్ గార్గ్. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ చైర్‌పర్సన్ క్రిస్ గోపాలకృష్ణన్, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ సిఈఓ రాజేష్ బన్సాల్, పరిశ్రమలు, అగ్ర ఫిన్‌టెక్ కంపెనీలు మరియు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

సదస్సులో ప్రధాన ఉపన్యాసం ఇచ్చిన ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ శ్రీ టి. రబీ శంకర్ చెల్లింపుల రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అంశంలో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఆర్థిక రంగంలో ముఖ్యంగా ఆర్థిక సంబంధిత రంగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఆర్‌బిఐ చర్యలు అమలు చేస్తున్నదని అన్నారు. ఆర్‌బిఐహెచ్‌ని సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసి ,బ్యాంకింగ్ రంగంలో ఆవిష్కరణలను సులభతరం చేయాలన్న లక్ష్యంతో ఆర్‌బిఐహెచ్‌ని ఆర్‌బిఐ ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు. , భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇప్పటికీ ఫీచర్ ఫోన్‌లను ఉపయోగిస్తున్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు. ఖర్చులను తగ్గించడం, వినియోగదారుల సేవలు మెరుగుపరచడం మరియు ఆర్థిక సేవల పరిధిని విస్తరించి మధ్యవర్తిత్వ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఫిన్‌టెక్ ఉపయోగపడుతుందని అన్నారు. సిబిడిసి అంశాన్ని ప్రస్తావించిన రబీ శంకర్ దీని ద్వారా ఇతర దేశాల్లో కూడా చెల్లింపులు చేయవచ్చునని వివరించారు. అన్ని దేశాలు తమ సొంత సిబిడిసి లను అభివృద్ధి చేస్తే, తక్షణమే మరియు అతి తక్కువ ఖర్చుతో సరిహద్దులు దాటి లావాదేవీలు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

యుఐడిఎఐ సిఇఓ డాక్టర్ సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో ఆధార్ ప్రాథమిక మార్పు తెచ్చిందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఆధార్ గణనీయమైన మార్పులు తెచ్చిందని అన్నారు. డిజిటల్ గుర్తింపు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వచ్చి ప్రధాన సంస్కరణలు మరియు ప్రభుత్వ పథకాలలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం, ప్రభుత్వ పథకాలను విశ్లేషించడం మరియు డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం లాంటి భవిష్యత్తు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆధార్ 2.0 కు యుఐడిఎఐ రూపకల్పన చేస్తున్నదని డాక్టర్ సౌరభ్ గార్గ్ వివరించారు.

రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ చైర్‌పర్సన్ క్రిస్ గోపాలకృష్ణన్ 130 కోట్ల భారతీయుల ప్రయోజనలను దృష్టిలో ఉంచుకుని ఆవిష్కరణలు జరగాలని అన్నారు. దీనికోసం ప్రజా వేదిక ఆధారంగా ప్రైవేట్ ఆవిష్కరణలను రూపొందించాలని సూచించారు. ఈ వేదిక స్వతంత్రంగా మరియు నిష్పక్షపాతంగా లాభాపేక్ష లేని సంస్థగా పనిచేయాలని అన్నారు. దీనిని ప్రభుత్వం లేదా లాభాపేక్ష లేని సంస్థ నిర్వహించాలని అన్నారు. అసమానత లేకుండా ప్రజలందరికి సమానంగా, తక్కువ ఖర్చుతో సేవలను అందుబాటులోకి తెచ్చి వారి జీవన సరళిని సాంకేతికత సహకారంతో మాత్రమే పరిష్కారాలను అందించవచ్చునని ఆయన వివరించారు.

ఆర్‌బిఐహెచ్ సిఇఒశ్రీ రాజేష్ బన్సాల్ తన ప్రసంగంలో ఆర్‌బిఐహెచ్ నినాదం ఇన్నోవేషన్, ఇన్‌క్లూజన్, ఇంపాక్ట్ అనేది విజన్‌పై ఆధారపడి ఉందని అన్నారు. ఆర్థిక చేరిక ద్వారా ఆర్థిక అవకాశాలను మెరుగు పరచడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ భాగస్వాములకు అవకాశాలను అందించేందుకు ఆర్‌బిఐహెచ్ ఒక వేదికగా పనిచేస్తుందని అన్నారు.

సాంప్రదాయ బ్యాంకింగ్‌ వ్యవస్ధ అనేక ప్రక్రియలు, భారీ పాలనా వ్యవస్థతో సాగింది. ఇదే సమయంలో సాంప్రదాయ బ్యాంకింగ్‌ వ్యవస్ధ పెద్ద సంఖ్యలో ఖాతాదారులను కలిగి, భారీ లావాదేవీలతో అపారమైన అనుభవం, విలువ, జ్ఞానాన్ని, సమాచారాన్ని కూడా కలిగి ఉంది. చట్టబద్ధమైన నియంత్రణ పరిథిలో ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యమయ్యే బ్యాంకులు పురోగతిని సాధించగలుగుతాయి. ఫిన్‌టెక్‌ సంస్థలను బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు తమ భాగస్వాములుగా పరిగణించాలి.

ఫేషియల్ అథెంటికేషన్, స్మార్ట్‌ఫోన్ ఆధారిత ప్రమాణీకరణ, ఆర్థిక రంగంలో బ్లాక్‌చెయిన్ వాడకం వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతపై నిపుణులు చర్చించారు. ఈ కెవైసి లాంటి సమాచార భాగస్వామ్యం ప్రక్రియలను సులభంగా మరియు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడానికి మార్గాలను చర్చించారు.

ఓపెన్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆధార్ 2.0లో భాగంగా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అప్‌గ్రేడ్, ఆర్థిక రంగానికి ఆధార్ ఆధారిత సేవలను మెరుగుపరచడంపై కూడా చర్చ జరిగింది. అగ్రశ్రేణి భారతీయ ఫిన్‌టెక్ సంస్థల ప్రతినిధులు, గుర్తింపు ధృవీకరణ మరియు చెల్లింపుల రంగానికి చెందిన అంకుర సంస్థలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు ఆధార్ 2.0 ఎలా ఉండాలన్న అంశంపై తమ అభిప్రాయాలను వివరించారు. సమాచార గోప్యతా బిల్లు నేపథ్యంలో దేశంలో సమాచార గోప్యత మరియు సమాచార నిర్వహణపై కూడా చర్చలు జరిగాయి. తమకు అవసరమైన ఆర్థిక సేవలను, అనవసరమైన అంశాలను సులువుగా తాము ఉన్న ప్రాంతం నుంచి గుర్తించి తక్కువ సమయంలో సేవలను పొందే అవకాశం ప్రజలకు కల్పించిన సమయంలో దేశం గణనీయమైన పురోగతి సాధించగలుగుతుంది.

ఆర్థిక సేవలలో డిజిటల్ గుర్తింపును అమలు చేయడం, సుపరిపాలన, అనుమానాలు, సందేహాలకు తావు లేని ఆర్థిక సేవలను అందించి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన చర్యలపై సదస్సు ఒక స్పష్టమైన అవగాహనతో సమావేశం ముగిసింది.

Courtesy :Press Information Bureau , GOI

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com