Banner
banner

ఈ రోజు డిసెంబరు25, క్రైస్తవ ధర్మప్రవక్త, శాంతి దూత ఏసు ప్రభువు జన్మదినం. అలాగే హిందూ ధర్మ ఉద్ధారకుడు పండిత మదన మోహన మాలవీయ పుట్టినరోజు. అంతేకాదు వాజపేయి ఇదేరోజు పుట్టారు.  గొప్ప మానవతావాదిగా, సంఘ సంస్కరణాభిలాషిగా, దేశ శ్రేయస్సును కోరే వ్యక్తిగా, గొప్ప తాత్వికునిగా, సౌందర్యోపాసకునిగా, సంస్కృతీ సాంప్రదాయాలను అమితంగా ప్రేమించే వ్యక్తిగా, మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజెప్పే ప్రబోధకునిగా, సామాజిక న్యాయాన్ని, మతసామరస్యాన్ని కోరుకునే మనిషిగా ఆయన ఈ దేశానికి కాదు ..కాదు ప్రపంచానికి సుపరిచితుడు.

ఒక సామాన్య ఉపాధ్యాయుడు కుమారుడైన వాజపేయి జర్నలిస్టుగా తన వృత్తి జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. రాష్టీయస్వయం సేవక్ సంఘ్లో చేరి స్వదేశ్, వీరార్జున్, రాష్ట్ర ధర్మ, పాంచజన్య పత్రికలకు సంపాదకత్వం వహించారు. రాత్రిపూట ఆ ప్రెస్ లో  ఇటుకలే తలగడగా నిద్రించి పత్రిక వెలుగు చూసేలా చేశారు. ఎమర్జెన్సీలో ఆయనను అప్పటి ప్రభుత్వం జైలు పాలుచేసింది. జీవితంలో,వృత్తిలో ఎన్ని ఒడి దుడుకులు ఎదురైనా ఎక్కడా నిబద్ధత కోల్పోలేదు. భారతీయ జనసంఘ్ అధ్యక్షుడుగా, తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా పార్టీని బలోపేతం చేస్తూ మెట్టు మెట్టూ ఎదిగారు.

జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా చేసిన ఆయన ఆ తర్వాత ప్రధానిగా ప్రపంచం మెచ్చిన నేత అనిపించుకున్నారు. మొదటి సారి 13 రోజులు, తర్వాత 13 నెలలు చివరకు దాదాపు అయిదు సంవత్సరాలు దేశాన్ని పాలించిన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఆయనే.  ప్రధాని పదవి చేపట్టిన కొంత కాలానికే వాజపేయి భారత అణు పాటవాన్ని పోఖ్రాన్‌లో పరీక్షల ద్వారా ప్రపంచానికి రుజువుచేసి ఒక అణుశక్తి గల దేశంగా భారత్‌ను అంతర్జాతీయ దేశాల సరసన నిలబెట్టారు.

పుట్టిన రోజు గురించి ఆయన ఓ కవితలో రాసిన మాటలే ఆయన విశాల ధృక్పధాన్ని సూచిస్తాయి..

 ప్రతి 25 డిసెంబరుకి నేను జీవితంలో ఒక మెట్టు ఎక్కుతాను. ప్రతి మలుపు దగ్గర ఇతరులతో తక్కువ, నాతో నేను ఎక్కువ యుద్ధం చేస్తాను. ఇతరులను బుజ్జగించగలుగుతాను కానీ నన్ను నేను సముదాయించలేకపోతాను–దూరంగా ఉన్న గోడపై అక్షరాలను చదవగలుగుతాను కానీ, నా హస్తరేఖలను చదవలేకపోతాను. సరిహద్దుల్లో కురుస్తున్న నిప్పును పసికడతానుకానీ నాచుట్టూ వ్యాపించిన నివురుగప్పిన నిప్పును గుర్తించలేను. పెళపెళమనే ఎండ, కుంభవృష్టితో వాన, గజగజ వణికించే చలి. ఒక ఏడాది గడిచిపోతుంది. జీవితంలో మరోమెట్టు ఎక్కుతాను. మరోపుట్టినరోజు జరుపుకుంటాను.  

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com