Banner
banner

“అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు…”

ఈ పాట వినగానే మీ చిన్నప్పుడు ఉయ్యాల్లో ఊగుతూ అట్ల తద్ది రోజున పాడిన ఈ పాట గుర్తు వచ్చే ఉంటుంది.  అట్ల తద్ది మన తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది  వస్తుంది. పల్లెల్లో ఈ రోజు ఆడపిల్లలు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు.  పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు. ఎంతో సందడిగా జరిగే ఈ పండగ కాలగర్బంలో కలవకుండా ఇంకా సజీవంగానే ఉందంటే మన పెద్దలే కారణం. ఓ ప్రక్కన ఆరోగ్యం, మరో ప్రక్కన దైవ భక్తి, గ్రహ అనుకూలత అన్ని ఈ అట్ల తద్దితో ప్రాప్తిస్దాయిని చెప్తూంటాయి.

గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే  సృష్టి, స్థితి, లయలకు కారకులయిన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలైన సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. సాధారణంగా అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా, పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతారు.  అట్లతదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు యువతులు మహిళలు అర్థనారీశ్వర స్తోత్రాన్ని పఠిస్తారు. అట్లతద్ది ముందురోజు కాళ్ళు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు.

పురాణ ప్రకారం…త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతిదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే వ్రతం. గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.ఇక ఈ అట్ల తద్దిలో చంద్రారాధన ప్రధానమైన పూజ గా జరుగుతంది. చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని అంటారు. ఈ పండగలో అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది.

అట్ల తద్ది రోజు చేసే అట్లు తయారీకి బియ్యం, మినప్పప్పును ఉపయోగిస్తాము.  బియ్యం నవగ్రహాలలో చంద్రునికి సంబంధించినది కాగా, మినుములు రాహు గ్రహానికి సంబంధించినవి. నవ గ్రహాలలో కుజుడుకీ అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగాపెడితే కుజదోషం పరిహారమై సంసారంలో ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు. రజోదయానికి కారకుడు కాబట్టి రుతుచక్రం సక్రమంగా ఉంచి రుతుసమస్యలు రాకుండా కాపాడుతాడు. దీంతో గర్భధారణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కుజదోషంతో వివాహం కాని వారు అట్లతద్ది నాడు కుజునికి అట్లను సమర్పించడం ద్వారా కుజ దోషం తొలగిపోయి వివాహం జరుగుతుంది.

అట్ల తద్ది రోజున  తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానమాచరించాలి. ఇంట్లో తూర్పు దిక్కున మండాపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి.  చంద్రదర్శనం అనంతరం గౌరీ దేవికు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని, శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం , తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం.ఈ అట్లతద్ది పండుగను గ్రామాలలో మహిళలు ఇప్పటికీ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.ఉదయం లేచిన దగ్గరనుంచి పూజా కార్యక్రమాలలో నిమగ్నమై, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సాంప్రదాయ దుస్తులను ధరించి, చేతులకు గోరింటాకు పెట్టుకుని గౌరీ దేవికి పూజలు చేస్తున్నారు. శుభమస్తు. 

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com