మహాత్ముడు గురించి ఎన్ని తరాలు, ఎంతమంది, ఎన్ని విధాలుగా చెప్పినా తరగదు..చరిత్ర మరవదు. మానవ జీవి హృదయం నుంచి ఆయన సిద్దాంతం వీడదు. అవును…గాంధీ …ఇప్పటికీ ఓ మనిషి…ఆయన మనమధ్యే గడిపారు అంటే నమ్మబుద్ది కాదు. మనమే కాదు ఐన్ స్టీన్ వంటి 21 శతాబ్దపు మేధావి కూడా గాంధీ గురించి అదే మాట చెప్పారు. ఇంతటి మహోన్నతమైన మానవతామూర్తి రక్తమాంసాలతో ఒక మనిషిగా జన్మించి మన మధ్యే నడయాడాడంటే నమ్మటం బహుశా భవిష్యత్ తరాలకు అసాధ్యం కావచ్చు” అని ఐన్ స్టీన్ ఆరోజు చేసిన వ్యాఖ్య ఇప్పటికీ నిత్యనూతనం. ఎందుకంటే ఆ స్దాయి కాదు కదా …ఆయన కు దగ్గరగా వచ్చిన వ్యక్తులను కూడా నేటి సమాజం చూడటం లేదు. అలాగే మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం కానీ ..ఆ .ఆదర్శాలను మన జీవితంలో అనువర్తింపచేయలేకపోతున్నాం. ఏదో ఇలా గాంధీ జయింతి వంటి సందర్బాలు వచ్చినప్పుడే అలా గుర్తు చేసుకుని మళ్లీ మన జీవితాల్లో పడిపోతున్నాం. గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి..మన ఇళ్లల్లో ఎంత మంది గాంధీ ఫొటోలు పెట్టుకున్నాం. సిని నటులకు ఇస్తున్న విలువలో వందోశాతం కూడా గాంధీకు ఇవ్వలేకపోతున్నాం.

అయితే ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి … కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గంలాంటి సంకుచిత భావాలతో నిత్యం దహించుకుపోతున్ననేటి తరం మనకు మహాత్మా అనే ఆ మూడు అక్షరాలు మానవత్వాన్ని నింపే మార్గదర్శకాలని నమ్ముటమే శరణ్యం. అంతటి మహోన్నత వ్యక్తికి గుర్తు చేసుకోవటానికి ఎవరికైనా అక్షరాలు రావు…. అశ్రువులు మాత్రమే వస్తాయి… అయ్యో…మన తరం ఆయన్ని దర్శించలేకపోయిందే అనే బాధ దహించి వేస్తుంది. అహింసను ఆయుధంగా దూసి స్వతంత్ర్యం సంపాదించటమే కాదు…ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. ఒక గాంధీ, ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఒక మండేలా…. వీరి శరీరాలకు మరణం ఉంది తప్ప వారి మానవతా విలువలకు లేదు.

1931 సెప్టంబర్ లో గాంధీ గారికి ఐన్ స్టీన్ రాసిన ఉత్తరంలో “హింస లేకుండా లక్ష్యాలను సాధించవచ్చు అని చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. హింసా విధానాలను అహింసా పద్ధతిలో జయించవచ్చు. మీ అడుగు జాడలు మానవాళికి ఎంతో స్పూర్తిని ఇస్తాయి. హింసతో కూడిన ఘర్షణ అంతమొందించి ప్రపంచ శాంతిని నెలకొల్పవచ్చని మీరు నిరూపించారు.” అని ఐన్ స్టీన్ రాశారు. అవును..హింసతో నిండిపోయిన నేటి సమాజంలో గాంధీ సిద్దాంతమే మనకు శరణ్యం. అన్యధా శరణం నాస్తి..త్వమేవ శరణం మమ అంటూ గాంధీ సిద్దాంతాన్నే మనం కొలవాలి. జాతి అలసత్వం పోయేంతవరకూ ఆచరించాలి. జై హింద్.

Similar Posts
Latest Posts from Vartalu.com