ఉగాది అంటే ఏమిటి? ఎందుకు జరుపుకోవాలి

చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని, వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ ఈ శ్లోకం తాత్పర్యం తెలుసుకుందాం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ వేళ ఈ సృష్టి ప్రారంభమైందని అర్థం. ప్రభవించిందని అర్థం. అందుకే తెలుగుసంవత్సరాలలో మొదటిది ప్రభవ. చివరిది క్షయ. నాశనమైందని. అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజున ఉగాదిగా నిర్ణయిస్తారు. నిర్ణయసింధుకారుడుకూడా అదే చెప్పాడు. తత్ర చైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ అన్నాడాయన. ఉగస్య ఆదిః ఉగాదిః అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. ఉగాదినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అంటారు. మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజుకూడా ఇదేనని ప్రతీతి. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఉగాదే. వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాదినాడే. ఉగస్య ఆది: ఉగాది: – “ఉగ” అనగా నక్షత్ర గమనము – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ ‘ఉగాది’. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది. ‘యుగము’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణం చెప్పుచున్నది. ”చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి వత్సరాదౌ వసంతా రపి రాజ్యే తదైవచ ప్రవర్తయామాస తదా కాల సగణనామపి గ్రహన్నాగే నృతూన్మాసానేవత్సరానృత్యరాధిపాన్‌. వసంతం ప్రారంభమైనపుడు చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రస జగత్తును సృష్టించాడట.