అంగరంగ వైభవంగా ఆవిర్భావ సంబురాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగు పెడుతుంది. ప్రతియేటా రాష్ట్ర అవతరణ సంబురాన్ని ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈసారి కూడా పెద్ద ఎత్తున వేడుకలు జరపుతోంది. శనివారం జరిగుతున్న ఈ వేడుకలను పండుగలా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అన్ని కార్యాలయాల్లో జాతీయపతాకాన్ని ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రతిజిల్లాకు రూ.2 లక్షలు కేటాయించింది. వేడుకల నిర్వహణకు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మైదానాలు ముస్తాబయ్యాయి. వేడుకల నిర్వహణకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించి, అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేసారు. వేడుకలను పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్ దీపాలతో ఆలంకరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ చేసారు. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల సహకారం వల్లే స్వరాష్ట్రం కల సాకారమైందని కవిత ట్వీట్ చేశారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధన కోసం కనబరచాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఉత్తమ పురస్కారాలను అందించడం జరుగుతుంది. ఈ నెల 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు వేయి మంది కళాకారులతో లుంబినిపార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు కళాయాత్ర జరుగనుంది. చిందు యక్షగానం, ఒగ్గుడోలు, చిరుతల రామాయణం కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఈ నెల 4న సాయంత్రం రవీంద్రభారతిలో పేరిణి శివతాండవం ప్రదర్శన జరగనుంది.