banner
Banner

మన చిన్నప్పుడు పద్యం చెప్తే పీచు మిఠాయి కొనిపెడతాను, ఈ ఎక్కం తప్పులు లేకుండా చెప్తే చాక్లెట్ ఇస్తాను అని పెద్దవాళ్లు మనవలను కూర్చోపెట్టుకుని వాళ్లకు ఆశపెట్టి,చదువుపై ఆసక్తి కలిగించేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. పెద్దవాళ్ల దగ్గరకు చేరే పిల్లలే లేరు. పద్యాలు వంటివి నేర్చుకునే తరం కనపడటం లేదు. ఇది గమనించాడు ఓ సాహిత్యాభిమాని. తన చిన్నప్పుడు రోజులు గుర్తు వచ్చాయో ఏమోకానీ …మీ పిల్లలు చేత పద్యాలు చెప్పిస్తే పెట్రోలు ఫ్రీ అని ప్రకటించాడు. ఆ వంకనైనా కాస్తంత పిల్లలు పద్యాలుపై మక్కువ పెంచుకుంటారేమో అని ఆశ. అయితే మన తెలుగు పద్యాలు కాదులెండి..మనవాళ్లలో ఇంకా ఆలోచనలు ఎవరికీ పుట్టలేదు. తమిళనాడులో ఉంటే  ‘సెంగుట్టవన్’ అనే ఓ సాహిత్యాభిమాని ఈ ప్రకటన చేసారు.

 కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సెంగుట్టవన్ వళ్లువర్ కు సాహిత్యం అంటే ప్రాణం. అందుకే అరుదైపోతున్న సాహిత్య ప్రయాణాన్ని ..నిత్య జీవిత ప్రయాణంతో ముడి పెట్టాడు. వాహనదారులు తమ చిన్నారుల్ని తీసుకువచ్చి ‘ఓ పద్యం చెబితే చాలు…ఉచితంగా పెట్రోల్ పోస్తామంటూ ప్రకటించారు. తమిళుల ఆరాధ్యుడు తిరువళ్లువర్ రచించిన తిరుక్కరళ్ గ్రంథంలోని పద్యాలను చెప్పిన వారికే ఈ ఆఫర్ అని ప్రత్యేకించి అన్నారు. ఎందుకంటే ప్రముఖ కవి తిరువళ్లువర్ రచించిన ‘తిరుక్కరళ్’ ప్రస్తావన లేనిదే తమిళ సాహిత్యం లేదు.  ఈ పద్యాలు నేర్చుకోవటానికి కూడా చాలా సులభంగా ఉంటాయి.

ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే తిరుక్కరళ్‌లో ఉన్న పద్యాల్లో కనీసం 20 చెబితే లీటర్ పెట్రోలు, 10 చెబితే అర లీటర్ పెట్రోలు ఫ్రీగా పోస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన బాగా వైరల్ కావటంతో ఫ్రీ పెట్రోల్ కోసం..తల్లిదండ్రులు తమ పిల్లలకు తిరుక్కరళ్ పద్యాలు నేర్పించేస్తున్నారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పటి వరకూ దాదాపు 200ల మంది విద్యార్దులకు పైగా ఈ పద్యాలను నేర్చుకున్నారని ఆనందం వ్యక్తంచేస్తున్నారు సెంగుట్టవన్.

ఈ ప్రకటన సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. చాలా మంది తమ పిల్లలను పెట్రోల్ బంక్‌కు తీసుకొచ్చి పద్యాలు చెప్పించి ఫ్రీగా పెట్రోల్ పట్టుకెళుతున్నారు. ఏదైమైనా ఉచిత పెట్రోల్ విషయం అటుంచితే..పిల్లల్లో సాహిత్యాభిరుచి పెంచేందుకు సెంగుట్టవన్ చేస్తున్న వినూత్న ప్రయత్నం అభినందించదగ్గది.Banner
, ,
Latest Posts from Vartalu.com
Banner