ప్రముఖ రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మి (95) గారు కన్నుమూశారు.   బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్డులోని ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. అదృష్టరేఖ, నీలంగేటు అయ్యగారు, తీర్పు నవలలతోపాటు కావ్య సుందరి కథ, ఒడ్డుకు చేరిన కెరటం, మనోవ్యాధికి మందుంది, మగతజీవి చివరిచూపు కథల్ని సుబ్బలక్ష్మి రచించారు.  ‘నీలం గేటు అయ్యగారు’ నవల విమర్శకుల మన్ననలు పొందింది.  గృహలక్ష్మి స్వర్ణ కంకణం, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయంనుంచి ప్రతిభా పురస్కారాలు స్వీకరించారు.

1925 సెప్టెంబరు 17న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో జన్మించిన ఆమె ప్రముఖ రచయిత్రిగా, చిత్రకారిణిగా గుర్తింపు పొందారు.  శివరాజు సుబ్బలక్ష్మిగారు ప్రముఖ రేడియోలో ఆఫీసర్, కవి, చిత్రకారుడైన శివరాజు వెంకట సుబ్బారావు(బుచ్చిబాబు) గారి భార్య. ఒక కవికి, ప్రముఖ రచయితకు భార్యే కాదు స్వతహాగా ఈవిడ కూడా ఒక రచయిత్రి , చిత్రకారిణి.

పదకొండేళ్ల వయసులో వీరికి వివాహమయ్యింది. అంతకు పూర్వమే ఆవిడ సంస్కృత , తెలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించుకొన్నారు. వారి నాన్నగారు ఆవిడ కోసం  ఆయా భాషల ఉపాధ్యాయులను ఇంటికే పిలిపించి శిక్షణ ఇప్పించేవారుట. వివాహం అయ్యాక కూడా బుచ్చిబాబుగారి ప్రోత్సాహం తో వారు పలు కథలు, కథానికలు వ్రాశారు.

బుచ్చిబాబుగారు ఆల్ ఇండియా రేడియోలో పని చేయడం మూలంగా ఎప్పుడూ  వచ్చే అతిథులలో  వారిల్లు కళకళలాడేది. ఆవిడ ఒక చేతిలో పుస్తకంతో, ఇంకో చేతిలో వాయిలిన్ తో,  ఇంకో చేతిలో కుంచెతో, అపర సరస్వతిగానే కాకుండా వచ్చి వెళ్ళేవారికి ఎప్పుడూ వడ్డిస్తుండే  అన్నపూర్ణగా కనిపించేవారని చెప్తారు.

ఆమె కథల్లో అప్పటి వాతావరణం కనపడేది. బాల్యంలోనే వివాహాలు, కాస్త వయసు రాగానే అత్తారింటికి పంపడం. ఆ తరవాత భర్త ఉద్యోగ రీత్యా వేరే ఊరిలో ఉంటే, ఆ ఇంట్లో అత్తగారు, ఆడపడుచుల సూటిపోటి మాటలు పడుతూ, చాకిరీ చేస్తూ భర్త ఎప్పుడు తన దగ్గరకు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ కాలం గడిపే స్త్రీలు ఆవిడ కథల్లో తరుచుగా కనిపించేవారు.  ఆవిడ తండ్రి శ్రీ ద్రోణంరాజు సూర్యప్రకాశరావు గారు గాంధేయవాది కావడంతో ఆవిడ రచనలలో ఎక్కువ శాతం గాంధేయ సిద్ధాంతలు కనబడుతాయి. ఆవిడ పెరిగిన ఊరి వాసనలు – పెంకుటిల్లు, నీళ్ళపొయ్యి డేశా, కొబ్బరాకుల గలగలలు.. మొదలైనవి  ఆమె కథలలో మెండుగా కనిపించటం విశేషం.

,
Similar Posts
Latest Posts from Vartalu.com