కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి..ఆనందపరుస్తాయి. పెద్దవాళ్లే రామాయణంపై ఏదైనా చిన్న ప్రశ్న వేస్తే తడబడుతున్న ఈ రోజుల్లో నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల పిల్లాడు రామాయణంపై ఇంగ్లీష్ లో పుస్తకం రాయటం ఆశ్చర్యం కాకపోతే మరేంటి. అదే సమయంలో మన సంస్కృతి,సంప్రదాయాలను తర్వాత తరం ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఆనందమూ కలుగుతుంది. ఇక ఈ వార్తలో ఉన్న మరో విశేషం ఏమిటీ అంటే ఆ పుస్తకానికి 9వ తరగతి చదివే అమ్మాయి బొమ్మలు గీసింది. సరే..పిల్లలు రాసి,గీసిన పుస్తకాన్ని మరింతమంది పిల్లలకు ప్రేరణంగా ఉంటుందని పిల్లల చేతే ఆవిష్కరింప చేసారు. పనిలో పనిగా వారే పుస్తకాన్ని సమీక్షించారు. ఈ విశేషాలకు నల్గొండ జిల్లా చిట్యాల వేదికైంది.

వివరాల్లోకి వెళితే..చిట్యాల మండలం నేరడకు చెందిన అద్విక్‌ రాపోలు రాసిన ‘అద్విక్‌ రామాయణం’ పుస్తకాన్ని చిట్యాలలోని ఓ ప్రైవేట్‌ స్కూల్ లో ఆదివారం విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ, చిట్యాల ఊళ్లలోని పిల్లలంతా సంబరంగా పాల్గొని పుస్తకాన్ని సమీక్షించారు. ఇందులోని బొమ్మలను మిర్యాలగూడకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని చిలుకూరి హరినందన గీసింది. తమ తోటి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా సరళమైన భాషలో అద్విక్‌ రామాయణం ఉందని రివ్యూ చేసిన స్టూడెంట్స్ పేర్కొన్నారు.

మరి ఈ కుర్రాడుకి ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే…రామాయణంపై టీవీలో ప్రసారమైన కార్టూన్లను చూసి ప్రేరణ పొందినట్లు అద్విక్‌ వివరించాడు. అద్విక్‌ తల్లిదండ్రులు సీతారామరాజు, కవిత దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నారు. అద్విక్‌ అక్కడే నాలుగో తరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో కొన్నాళ్లుగా వీరు స్వగ్రామంలో ఉంటున్నారు. ఉండటమే కాదు..చక్కగా ఈ రామాయణ రచనా కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. సూపర్ కదా
Similar Posts
Latest Posts from Vartalu.com