ఓ ఫ్రధాని ఇంత నిరాడంబరంగా ఉంటారని మీరు ఊహించరు

ఆ రోజు న్యూ దిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ ఎడ్మిషన్స్ చాలా హడావిడిగా ఉంది. ఆ కాలేజీలో సీటు తెచ్చుకోవటం అంటే ఆషామాషీ విషయం కాదు. కానీ అనీల్ అక్కడ సీట్ సంపాదించాడు. ఎడ్మిషన్స్ వరసగా జరగుతున్నాయి. కుర్రాళ్లంతా లైన్ లో నిలబడ్డాడు. అందులో అనిల్‌ కూడా ఉన్నాడు. పైన విపరీతమైన ఎండ.ఆ ఎండ వేడిమికి తట్టుకోలేక అనీల్ స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆ దగ్గరలోని హాస్పటిల్ కు తీసుకెళ్లారు అక్కడ లెక్చరర్స్, తోటి స్టూడెంట్స్. కాస్సేపటికి అనిల్‌ తేరుకొన్నాక-మీ నాన్నగారి పేరు, ఎడ్రస్ చెప్తే ..వాళ్లకి తెలియచేస్తామన్నారు. ఆ కుర్రాడు మొదట చెప్పటానికి ఇష్టపడలేదు. కానీ వాళ్లు అనుమానంగా చూస్తూండటంతో తప్పక.. రివీల్ చేసారు. ఆ నీరసం, నిస్సత్తువతో అనిల్‌ చెప్పిన తండ్రి పేరు-మరేదో కాదు.. లాల్‌ బహాదుర్‌ శాస్త్రి,ఆయన అప్పటి భారత ప్రధాన మంత్రి! అనిల్‌ చెప్పిన పేరు విని నోట మాట రాక అక్కడివాళ్లు ఆశ్చర్యపోతే, ఆ ఘటన జరిగిన ఇన్నాళ్ళ తరవాతా జాతి జనుల్ని అది ఆశ్చర్యచకితుల్ని చేస్తూనే ఉంది. ఎందుకంటే లాల్ బహాదూర్ శాస్త్రి తను ప్రధానమంత్రి అయినా అది ఆయన చేతల్లో కానీ మాటల్లో కానీ కనిపించనిచ్చేవారు కాదు. తన కుటుంబాన్ని సైతం అలాగే కట్టుదిట్టం చేసారు. ఇక లాల్ బహాదుర్ శాస్త్రి గారి నేపధ్యం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. తండ్రి చిన్నతనంలో చనిపోవటంతో .. తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో ఒబ్బిడిగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. ఆయన నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు…అదీ ఆయన గొప్పతనం..అదే పద్దతి ఆయన జీవితాంతం అనుసరించారు.