స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో ఉన్న కొవిడ్‌-19ను అదుపు చేసే ఔషధంగా పేర్కొంటున్న మోల్నుపిరవిర్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్‌ ఫార్మా సంస్థ  సిద్ధంగా ఉన్నట్లు   తెలిపింది. ఇన్‌ఫ్లుయంజా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తున్న మోల్నుపిరవిర్‌ను కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వారిపై వినియోగించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ‘రీపర్పసింగ్‌’ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఆప్టిమస్‌   ఫార్మా మూడో దశ క్లినికల్‌ పరీక్షలను నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా ఈ ఔషధాన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్‌-19 రోగులకు అందించి, చికిత్సలో వినియోగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అనుమతులు కోరుతూ.. సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తు దాఖలు చేసినట్లు  తెలిపింది. ఇప్పటిదాకా రెండు దశల్లో నిర్వహించిన ప్రీ క్లినికల్‌ పరీక్షల్లో అంచనాలకు మించి ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది. మోల్నుపిరవిర్‌ ద్వారా చికిత్స అందించినప్పుడు 5 రోజుల వ్యవధిలో సత్ఫలితాలు కనిపిస్తాయని, నోటి ద్వారా అందించే చికిత్స కావడం వల్ల రోగులకు ఇబ్బందులూ తగ్గుతాయని పేర్కొంది. కొవిడ్‌-19 రెండో దశ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఔషధానికి సీడీఎస్‌సీఓ అత్యవసర వినియోగ అనుమతిని ఇస్తుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొంది. అనుమతి లభిస్తే.. నెల రోజుల్లోపు ఈ ఔషధాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు  ఆప్టిమస్‌ ఫార్మా ఛైర్మన్‌, సీఈఓ డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

మోల్నుపిరవిర్‌కు జనరిక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్‌ ఫార్మా వెల్లడించింది. ఇప్పటికే నిర్వహించిన ప్రీ-క్లినికల్‌ పరీక్షల్లో ఈ ఔషధం సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనట్లు తేలిందని, ఎలాంటి ప్రతికూల లక్షణాలూ కనిపించలేదని పేర్కొన్నారు. స్వల్ప, మధ్యస్థ కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి చికిత్సలో ఉపయోగిస్తున్న ఫావిపిరవర్‌ను తాము ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మోల్నుపిరవిర్‌ను 800 ఎంజీ మోతాదులో విడుదల చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

, ,
Similar Posts
Latest Posts from Vartalu.com