అసత్యంతో మీ ప్రయోగాలా? 150 కాదు..149

ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన మన జాతిపిత జన్మదినాన్ని ఏటా ‘అహింసా దినోత్సవం’గా నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ రోజున ( అక్టోబరు 2) కూడా ఘనంగా చేసుకుంటున్నాం. అయితే ఈ జయంతికి ఓ ప్రత్యేకతను ఆపాదించింది మీడియా. అదే…. ఈ ఏడాది మహాత్మా గాంధీ 150వ జయంతి అని. ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా నిర్వహించుకోవడానికి దేశం సమాయాత్తమవుతోందంటూ వార్తలు ప్రసారం చేస్తోంది. అందులో వింతేముంది అంటారా..నిజమే కదా..అంటే ..ఓ విషయం చెప్తాము..నిజానికి ఇది 149 వ జయంతి. పొరబడ్డారో లేక కావాలనే పొరపాటు చేస్తున్నారో కానీ నేషనల్ మీడియా సైతం 150 అంటూ హెడ్డింగ్ లు పెట్టేస్తోంది.బ్రేకింగ్ న్యూస్ లు వల్లించేస్తోంది. కానీ మన దేశ న్యూస్ అఫీషియల్ అదేనండీ దూరదర్శన్ మాత్రం 149 వ జయంతి అంటూ నిజాన్ని నిజంగా చెప్పింది. సత్యాన్ని తన జీవితాంతం నమ్మి ప్రచారం చేసిన గాంధీ జయింతి కు ఈ అసత్యపు మాటలెందుకు. అయితే ఈ విషయం గమనించిన జాతీయ మీడియాలో మొదట 150 అన్నా ..వెంటనే దాన్ని 149 గా మార్చేసాయి. సౌండ్ బాగుందని సత్యాన్ని ప్రక్కదారి పట్టిస్తే ఎలా…ముఖ్యంగా సత్యం కోసం తన జీవితాన్నే ప్రయోగంగా మార్చిన మహానీయుడు జన్మదినం విషయంలో…150 అయితే ఏంటి..149 అయితే ఏంటి నష్టం ఏముంది అనొచ్చు..కానీ నష్టం లేదని అసత్యాన్ని ప్రచారం చేయలేం కదా. నిజం మనిషికి ధైర్యాన్నిస్తుందని, పోరాడే శక్తినిస్తుందని మహాత్ముడు చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన సత్యాగ్రహాన్ని బలమైన ఆయుధంగా ఎన్నుకున్నారు.ప్రతి మనిషీ సత్యానికి బద్ధుడు అని ప్రవచించారు గాంధీజీ. తన జీవితాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని భారతీయ చింతనకు కొత్త రంగులద్దిన విషయం మనం మర్చిపోకూడదు. అదే ఆయన్ని మనం గుర్తుంచుకున్నాం అని చెప్పటానికి ఓ ప్రబల నిదర్శనం.