తెలుగు కథకు పెద్ద దిక్కు వెళ్లిపోయింది

updated: May 19, 2018 12:21 IST
తెలుగు కథకు పెద్ద దిక్కు వెళ్లిపోయింది

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(79) కన్నుమూయటం సాహిత్యాభిమానులకు తీరనిలోటే. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నాలుగు రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.  చక్రనేమి’ కథతో సాహితీ ప్రస్థానం ప్రారంభించిన సుబ్బరామయ్య 200కు పైగా కథలు రాశారు... అనేక అవార్డులు అందుకున్నారు.

1938లో గుంటూరులో జన్మించిన సుబ్బరామయ్య చిన్నతనంలోనే తండ్రిని..తదనంతంరం అన్నయ్యని  పోగొట్టుకున్నారు.   అటు పాఠ్యపుస్తకాలు, ఇటు సాహిత్యమూ ఆయన్ని ఆ శోకం నుంచి కాపాడాయి...అంతేకాదు.. జీవితంలో నిలదొక్కుకునేందుకు సాయపడ్డాయి.   విశ్వనాథ సత్యనారాయణవంటి పెద్దల సాన్నిహిత్యం కూడా ఆయన సాహిత్య జీవితానికి  ప్రేరణనిచ్చింది. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో 40 ఏళ్లపాటు అధ్యాపకునిగా పనిచేసిన ఆయన...ఒక పక్క విద్యార్థులకు తెలుగుని బోధిస్తూనే మరోపక్క అదే తెలుగు సాహిత్యంలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్నారు. 

సాహిత్య జీవితానికి వస్తే.. 1959లో సుబ్బరామయ్యగారి తొలి కథ ‘చక్రనేమి’ అచ్చయ్యిన నాటి నుంచి ఆగకుండ రాస్తూనే ఉన్నారు. ఆ కథలు ఒకదానితో మరొకటి పొంతన లేనట్లు కనిపించటం ఆయన సృజనలో ఓ స్పెషాలిటీ. అలాగే  సుబ్బరామయ్యగారి మరో ప్రత్యేకత ఏమిటీ అంటే...ఆయన కథలకు ఎక్కడెక్కడి ఇతివృత్తాలో తీసుకుని తీసుకోలేదు. తన జీవితానుభువాలు..తను చూసిన మనుష్యుల నే కథల్లోకి తీసుకువచ్చారు.   స్పందించే హృదయం ఉండాలే కానీ రోజువారీ కనిపించే జీవితాలలోంచి కూడా అద్భుతమైన ఘట్టాలను సృజించవచ్చని ఆయన నిరూపించారు.

ఈయన కథలతో పాటు 8 నవలలను కూడా రచించారు.  ‘పూర్ణాహుతి’, ‘దుర్దినం’, ‘శుక్రవారం’, ‘ఏస్‌ రన్నర్‌’, ‘వీళ్ళు’ (కథాసంకలనం) వంటి కథలు.. ‘ముక్తి’, ‘చేదుమాత్ర’ నవలలు పెద్దిభొట్లకు పేరు తెచ్చాయి. పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (వాల్యూం -1)కు గానూ 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.కాగా, పెద్దిభొట్ల తాను జీవించి ఉన్న కాలంలోనే తన శరీరాన్ని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి దానం చేశారు


Tags: peddibhotla subbaramayya .telugu writer

comments